ఇలా ఎలా : రూ.2 వేల డ్రైఫూట్స్.. 3 లక్షలు మాయం

ఇలా ఎలా : రూ.2 వేల డ్రైఫూట్స్.. 3 లక్షలు మాయం

ఒక్కోసారి మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం ఉంటాం.. ఖరీదైనప్పటికీ కొనుగోలు చేయాలనుకుంది ఓ మహిళ. ఆన్ లైన్ లో తక్కువకే డ్రైఫ్రూట్ దొరుకుతున్నాయని, ఆఫర్లు ఉన్నాయని కొనుగోలు చేసేందుకు సిద్దమైంది. ఫేస్ బుక్  ప్రకటన చూసి రూ.2 వేలు చెల్లించి డ్రైఫ్రూట్స్ ఆర్డర్ చేసింది. డ్రైఫ్రూట్స్ పార్సిల్ అందుకోవాల్సిన ఆమెకు దురదృష్టకర సంఘటన ఎదురైంది. ఆన్ లైన్ లో పేమెంట్ చేసి బ్యాంకు ఖాతా చూసుకుంటే ఆమెకు కళ్లుబైర్లు కమ్మాయి. కష్టపడి సంపాదించిన డబ్బు  3 లక్షలు మాయం కావడంతో షాక్ గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ చెల్లింపులు చేసి మోస పోయిన మహారాష్ట్రకు చెందిన మహిళకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఫుల్ డిటెయిల్స్ చూద్దాం.  

టెక్నాలజీ అభివృద్ది చెందిన కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ సైబర్ క్రైమ్లు రోజుకో తీరుగా జరుగుతున్నాయి. కొందరు యూపీఐ పేమెంట్స్ ద్వారా మోసపోతే.. మరికొందరు బ్యాంక్ ఖాతా వివరాలు  తెలియకుండా ఇతరులకు షేర్ చేసి ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. వైరస్ లను డివైజ్ లోకి జొప్పించడం ద్వారా డేటా స్టీలింగ్ చేస్తూ కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ప్రభుత్వం, అటు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చెపట్టినా ఈ సైబర్ క్రైమ్ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు.. ఆన్ లైన్ పర్చాసింగ్ చేసేటప్పుడు అవగాహనతో, జాగ్రత్తగా చేయడం ద్వారా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. 

ఇటీవల మహారాష్ట్రకు చెందిన 54 ఏళ్ల మహిళ డ్రైఫ్రూట్ కొనుగోలు చేస్తూ ఆన్ లైన్ లో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 3లక్షలు పైగా పోగొట్టుకున్నట్లు పోలీసులు బుధవారం (డిసెంబర్ 27) తెలిపారు. ఆమె సెప్టెంబర్ 20 న ఫేస్ బుక్ లో డ్రైఫ్రూట్స్ కోసం ఆన్ లైన్ స్టోర్ లో ఆర్డర్ చేసింది. డబ్బులు చెల్లించేందుకు ప్రకటనలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ను సంప్రదించింది. అవతలి నుంచి మాట్లాడిన వ్యక్తి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలని సూచించాడు. దీంతో ఆ మహిళ యూపీఐ ద్వారా ఆన్ లైన్ పేమెంట్ చేసింది. అయితే అవతలి వ్యక్తి డబ్బులు రాలేదని ఆమెకు చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆమె బ్యాంకు ఖాతానుంచి రూ. 3లక్షల 9వేల 337 డ్రా అయినట్లు గుర్తించింది. 

అవతలి వ్యక్తిని సంప్రదించేందుకు ఆమె ప్రయత్నం చేయగా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం(డిసెంబర్ 26) పన్వేల్  పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 420 , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు లోని సంబంధిత సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పన్వేల్ పోలీసులు.