
మెదక్ (అల్లాదుర్గం), వెలుగు : బైక్ వీల్లో చీరకొంగు ఇరుక్కొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందిన దొంతి తుకారాం, ఆయన భార్య నిర్మల తమ కొడుకు (18 నెలలు) తో కలిసి బైక్ మీద హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో కాయిదంపల్లి గ్రామ శివారులో 161వ నేషనల్ హైవే మీద నిర్మల (23) చీరకొంగు బైక్ వెనుక చక్రంలో చిక్కుకోవడంతో వెహికల్ పైనుంచి ఆమె కింద పడిపోయింది. దీంతో తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. బైక్ నడుపుతున్న తుకారాం, ఆయన కొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు నిర్మల డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుకారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.