ఛత్తీస్గఢ్లో దారుణం.. అడవి పంది దాడిలో మహిళ మృతి

ఛత్తీస్గఢ్లో దారుణం.. అడవి పంది దాడిలో మహిళ మృతి

ఛత్తీస్ గఢ్ లోని పాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవి పంది దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అడవి పంది దాడినుంచి తన కూతుర్ని కాపాడే క్రమంలో తన ప్రాణాలు పోగొట్టుకుంది. పాసన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నివాస్ అందించిన వివరాల ప్రకారం.. దువాషియా బాయి (45) ఆమె కూతురు రింకీ (11) ఆదివారం పొలం పనులు చేసుకుంటుండగా రింకీపై అడవి పంది దాడి చేసింది. కూతురుపై దూసుకెళ్తున్న పంది నుంచి రక్షించేందుకు దువాషియా పందికి అడ్డు వెళ్లింది. తన చేతిలో ఉన్న గొడ్డలితో పందిపై విరుచుకు పడి పందిని చంపేసింది. అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ దువాషియా హాస్పిటల్ తీసుకెళ్తుండగా మరణించింది.

విషయం తెలిసి అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. వన్య ప్రాణుల దాడికి నష్ట పరిహారంగా బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25వేలు అందించారు. మిగతా రూ.5.75 లక్షల పరిహారాన్ని  లాంచనాలు పూర్తయిన తర్వాత  అందించనున్నట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపాడు.