
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ధర్నా
సిద్దిపేట రూరల్, వెలుగు : ఆపరేషన్ చేస్తుండగా మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన మంగళవారం సిద్దిపేట పట్టణంలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) కొద్ది రోజులుగా గాల్ బ్లాడర్ లో రాళ్లతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సిద్దిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆపరేషన్ చేస్తుండగా ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు.. రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఆపరేషన్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చిందని, వేరే హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
వెంటనే కుటుంబ సభ్యులు రాజేశ్వరిని వేరే హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె చనిపోయిన విషయం గుర్తించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు మంగళవారం ఉదయం హాస్పిటల్‌కు చేరుకొని ధర్నా చేశారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, మృతురాలి కుటుంబీకులతో హాస్పిటల్ యాజమాన్యం రాజీ కుదుర్చుకొని డెడ్‌బాడీని బయటకు పంపించింది. ఈ విషయమై హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.