
- జనగామ జిల్లా కడవెండికి చెందిన రేణుకగా గుర్తింపు
- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ప్రెస్‌టీం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న రేణుక
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ-, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్ట్ చనిపోయింది. ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ప్రెస్ టీం ఇన్‌చార్జి రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. దంతెవాడ జిల్లా గీదం, బీజాపూర్ జిల్లా భైరంగఢ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నెల్గొడ, అకేలీ, బెల్నార్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని భద్రాతాబలగాలకు సమాచారం అందింది. దీంతో కూంబింగ్ చేస్తున్న బలగాలకు సోమవారం ఉదయం 9 గంటల టైంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ క్రమంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ రేణుక చనిపోయింది. ఆమెపై చత్తీస్‌గఢ్‌లో రూ. 25 లక్షలు, తెలంగాణలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ అనంతరం ఇన్సాస్ తుపాకీతో పాటు, పేలుడు పదార్థాలు, ల్యాప్‌ట్యాప్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రేణుకది జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం అని పోలీసులు ప్రకటించారు.
30 ఏండ్లుగా ఉద్యమంలోనే..
జనగామ, వెలుగు : సుమారు ముప్పై ఏండ్లుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్న గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతి చనిపోవడంతో స్వగ్రామం జనగామ జిల్లా కడవెండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడవెండికి చెందిన సోమయ్య, జయమ్మకు ముగ్గురు సంతానం కాగా రేణుక ఒక్కతే కూతురు. కడవెండి ప్రభుత్వ స్కూల్‌లో ప్రాథమిక విద్య, దేవరుప్పులలో హైస్కూల్ చదువు పూర్తి చేసింది. తర్వాత తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివిన ఆమె అక్కడే కొంతకాలం అడ్వకేట్‌గా పనిచేసింది.
1996లో మావోయిస్ట్ పార్టీలో చేరిన రేణుక మహిళా అనుబంధ సంఘంలో పనిచేస్తూ చంద్రబాబుపై అలిపిరి దాడి తర్వాత పూర్తిగా అడవి బాట పట్టింది. తొలినాళ్లలో ఏపీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కృష్ణ నాయకత్వంలో పనిచేసిన ఆమె 2003లో డీవీసీఎంగా పదోన్నతి పొందారు. 2020లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రెస్ టీం ఇన్‌చార్జి, ప్రభాత్ పత్రిక ఎడిటర్‌గా నియామకమైంది. పార్టీలో ఉన్న టైంలో కడవెండికే చెందిన ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె.. ఆయన ఎన్‌కౌంటర్ తర్వాత 2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు అలియాస్ రవిని వివాహం చేసుకున్నారు.
రేణుక సోదరుడు జీవీకే ప్రసాద్ అలియాస్ సుఖ్‌దేవ్ అలియాస్ గుడ్సా ఉసెండీ సైతం మావోయిస్ట్‌గా పనిచేసి 2014లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మరో సోదరుడు రాజశేఖర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. రేణుక మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు దంతెవాడకు బయలుదేరినట్లు సోదరుడు జీవీకే ప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు కడవెండికి తీసుకువస్తామని, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.