కందనూలు, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో 3 తులాల పుస్తెలతాడు మాయమైంది. వివరాలిలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఆదివారం బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి వెళ్లేందుకు మైసమ్మ స్పెషల్ బస్సులో ఎక్కింది.
కండక్టర్ ఫ్రీ టికెట్ కోసం ఐడీ కార్డులను చూపించాలని కోరగా, బాధితురాలు ఐడీ కార్డును చూపించే క్రమంలో మెడలో పుస్తెలతాడు మాయమైనట్లు గమనించింది. వెంటనే కండక్టర్ కు విషయం చెప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా, బస్టాండ్ ప్రాంతంలోనే బస్సును నిలిపేసి తనిఖీలు చేయగా దొరకలేదు. అంతకుముందే పుస్తెలతాడు ఎక్కడైనా పోగొట్టుకొని ఉండొచ్చనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.