దొంగతనం మోపి అవమానించారని..మహిళ ఆత్మహత్య

  • తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ఆవేదన 
  • తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ఆవేదన 
  • చనిపోయే ముందు అన్నకు ఫోన్ కాల్ 
  • తక్కువ కులమని సతాయిస్తున్నరని కన్నీళ్లు 
  • ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • యాదాద్రి జిల్లా సిరిపురంలో ఘటన

ఎల్బీనగర్/యాదాద్రి, వెలుగు: దొంగతనం కేసుకు సంబంధించి ఓ మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, ఆ కంప్లయింట్​చేసిన వ్యక్తి సంగతి చూస్తానంటూ స్టేషన్ లోనే  బెదిరించడం, మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పడంతో అవమానభారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన రాపోలు రమ్య, నరేశ్​దంపతులు. వీళ్లు ఈ నెల 5న హయత్​నగర్ లోని రామానుజ కాలనీకి చెందిన మేలిడి మానస, సునీల్​దంపతుల కొడుకు బర్త్​డే ఫంక్షన్ కు వెళ్లారు. 

ఆ రోజు రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండాలని ఒత్తిడి చేయడంతో వాళ్లింట్లో నిద్రించారు.  మరుసటి రోజు లేచి సొంతూరుకు వెళ్లారు. అయితే అదే రోజు సాయంత్రం రమ్యకు మానస ఫోన్​చేసి.. ‘మా ఇంట్లో బ్యాగులో పెట్టిన బంగారు చైన్​పోయింది. 

అక్కడ మీరే పడుకున్నారు.. మీకేమైనా దొరికిందా?’ అని అడిగింది. తాము తీయలేదని రమ్య చెప్పగా.. ‘తీస్తే ఒప్పుకోవాలని, లేకపోతే ఎంతదూరమైనా వెళ్తాం’ అని మానస చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే జంగిటి మురళి అనే వ్యక్తి రమ్య భర్తకు ఫోన్​ చేసి.. ‘బ్యాగులో రెండు బంగారు చైన్లు, ఉంగరాలు ఉండే. అందులో రెండు తులాల గొలుసు కనిపిస్తలేదు. రమ్య తీసిందని మాకు అనుమానంగా ఉంది’ అని చెప్పాడు. 

ఈ విషయమై పదే పదే ఫోన్ చేసి వేధించాడు. తర్వాత హయత్​నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో హయత్​నగర్​పీఎస్​నుంచి ఫోన్​రావడంతో 7న రమ్య, నరేశ్​ఇద్దరూ స్టేషన్ కు వెళ్లి దొంగతనంతో తమకు సంబంధం లేదని వివరించారు. ఆ సమయంలో ఎస్ఐ సైదులు, మురళి.. తన భార్యతో అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో నరేశ్ పేర్కొన్నారు. 

విచారణ ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ గురువారం విచారణకు రావాలంటూ హయత్​నగర్​పీఎస్​నుంచి ఫోన్​రావడంతో రమ్య అవమానంగా భావించింది. గురువారం తెల్లవారుజామున రంగుల్లో కలిపే కెమికల్​తాగింది. 

కొద్దిసేపటికి గుర్తించిన నరేశ్.. ఆమెను రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా చనిపోయింది. తమపై దొంగతనం మోపి భయాందోళనకు గురి చేసి తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన జంగిటి మురళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు నరేశ్​ఫిర్యాదు చేశాడు.

 ఎస్సై సైదులు, జంగిటి మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తూ సిరిపురం గ్రామస్తులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో నల్గొండ-–భువనగిరి రోడ్డుపై భారీ సంఖ్యలో వెహికల్స్​నిలిచిపోయాయి. చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు. 

కేసు నమోదు చేయకుండానే విచారణకు..

మురళి ఫిర్యాదుతో పోలీసులు జీడీ ఎంట్రీ చేసి రమ్యను, అదే ఫంక్షన్​కు హాజరైన మరో మహిళ కవితను విచారణకు పిలిపించారు. ఆ టైమ్ లో ఎస్సై సైదులు ముందే రమ్యను మురళి బెదిరించాడని సమాచారం. 

‘రూ.50 వేలు ఖర్చయినా పెడ్తా మిమ్మల్ని వదిలిపెట్ట’ అని అన్నాడని, ఎస్సై ముందే కాలు మీద కాలు వేసుకుని సంగతి చూస్తానని బెదిరించాడని, దీంతో రమ్య భయపడిపోయిందని తెలుస్తున్నది. తాము ఏ బంగారం తీయలేదని, అందులోనే మరో రెండు బంగారం చైన్లు ఉన్నాయని మురళి చెప్తున్నాడని.. ఒకవేళ తాము దొంగలమైతే అవి కూడా తీసేవాళ్లం కదా? అని రమ్య అడగ్గా..  ‘మా దగ్గర లాజిక్​లు మాట్లాడొద్దు’ అని ఎస్ఐ కూడా బెదిరించినట్టు తెలిసింది. 

అంతటితో విచారణను పూర్తి చేయకుండా గురువారం మళ్లీ ఎంక్వైరీకి రావాలని పిలిచారు. దీంతో పోలీస్​స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ఊరి వాళ్లు, బంధువులు ఏమనుకుంటారోనని రమ్య భయపడింది. మురళికి పలుకుబడి ఉందని, అందుకే స్టేషన్​లో బెదిరించాడని, పోలీసులు కూడా అభ్యంతరం చెప్పలేదని బాధపడింది. అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై హయత్ నగర్ ఇన్​స్పెక్టర్​నాగరాజు వివరణ కోరగా ఎస్సై గానీ, సిబ్బంది గానీ ఆమెపై ఎలాంటి బెదిరింపులకు దిగలేదని చెప్పారు. 

నా భార్యను బెదిరించినా ఎస్సై ఏమనలేదు: నరేశ్ 

తాము ఎలాంటి తప్పు చేయలేదని రమ్య భర్త నరేశ్ తెలిపారు. ‘‘నేను, నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు. పోలీసులు ఫోన్ చేసి గోల్డ్ పోయిన కేసులో రమ్యపై అభియోగం ఉందని స్టేషన్​కు రావాలని చెప్పడంతో హయత్ నగర్ పీఎస్ కు పోయాం. 

మొదట ఏఎస్ఐ మాట్లాడిండు. తర్వాత ఎస్సై సైదులు వచ్చాడు. అప్పుడు మా సంగతి చెప్తానంటూ మురళి బెదిరించిండు. ఎస్సై అక్కడే ఉన్నా ఏమనలేదు. నా భార్య వర్షన్ చెప్పుకునే ప్రయత్నం చేయగా, లాజిక్ గా మాట్లాడకు అని ఎస్సై బెదిరించిండు. నా భార్య చాలా సెన్సిటివ్. ఎస్సై బిహేవియర్​బాగాలేదని బాధపడింది’ అని నరేశ్ వాపోయాడు.

అన్నకు ఫోన్ చేసి ఆవేదన.. 

ఆత్మహత్యకు ముందు వరుసకు అన్న అయ్యే శ్యామ్​కు ఫోన్​చేసి జరిగిందంతా చెప్పుకుని రమ్య బాధపడ్డది. ‘అన్న.. నాపై దొంగతనం కేసు పెట్టి వేధిస్తున్రు. విచారణకు పిలిచి బెదిరించిన్రు. నేను 12 ఏండ్ల కింద పెండ్లి చేసుకున్న... నేను తక్కువ కులం దాన్ని అని ఇట్ల చేస్తరా అన్న.. ఊర్లో పరువు పోతోంది. 

స్టేషన్​నుంచి రాంగనే ‘ఏమైంది బంగారం పోయిందంట.. నువ్వే తీసినవా?’ అని అందరూ అంటున్నరు. ఇయ్యాల నేను సచ్చిపోతా.. ఉట్టిగ సచ్చిపోతే దొంగతనం చేసింది సచ్చిపోయిందంటరు. ఏదైనా ప్రూఫ్​ఉండాలె కదా.. ఈ ఫోన్​కాల్​రికార్డు చేసుకో అన్న.. నేను చస్తే వాని మీద కేసు వెయ్యాలె. వాడు మా ఆయన కాళ్లు మొక్కాలె. నేను చేయబట్టి మా ఆయన సఫర్​అయితున్నడు’ అని ఫోన్​పెట్టేసింది.