కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. మృతురాలు స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అనే వ్యాధితో చనిపోవడంతో డెడ్‌బాడీపై దద్దులు వచ్చి పట్టుకుంటే చర్మం ఊడిపోయింది.
దీంతో కుటుంబీకులు డెడ్‌బాడీని పట్టుకోకుండా హడావుడిగా గేట్‌కారేపల్లి శ్మశానవాటికలో జేసీబీతో గొయ్యి తీయించి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులకు విషయం తెలియడంతో కొత్త వైరస్‌తోనే చనిపోయిందని అనుకున్నారు. అలాగే ప్రచారం జరగడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది.
దీంతో సుప్రియ మృతిపై అనుమానాలు నివృత్తి చేయడానికి ఎంపీడీవో చంద్రశేఖర్, మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ మందులవాడకు వచ్చి విచారణ జరిపారు. జిల్లా వైద్యబృందం ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు వెళ్లి వివరాలు తెలుసుకుంది. ఎస్.జె.సిండ్రోమ్ తోనే చనిపోయినట్టు జిల్లా వైద్యబృందం నిర్ధారించిందని మండల వైద్యాధికారి సురేశ్ తెలిపారు.