తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని రోడ్డుపై పడుకుని మహిళ నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తమ భూమిని కబ్జా చేసిన వారికి ఆఫీసర్లు సహకరిస్తూ తనకు న్యాయం చేయడం లేదంటూ ఓ గిరిజన మహిళ కొత్తగూడెంలో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసింది. పట్టణంలోని పోస్టాఫీస్​సెంటర్​లో ఆందోళన చేయడంతో ట్రాఫిక్​ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఆమెను రోడ్డుపై నుంచి లేపేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. బలవంతగా తీసుకుపోవడానికి ప్రయత్నించగా తల కొట్టుకొని చస్తానంటూ బెదిరించింది. దీంతో ఎలాగో బుజ్జగించి ఆమె భర్త సాయంతో పక్కకు తీసుకువెళ్లారు. 

బాధిత మహిళ భానోత్​ ప్రియాంక, ఆమె భర్త కృష్ణ, ఆమె తల్లి పద్మ, మరదలు బిందు కథనం ప్రకారం...చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన ప్రియాంకకు సంబంధించిన రెండున్నర ఎకరాల్లో ఎకరం భూమిని 2022లో బంధువులైన భానోత్​రాంబాబు, హరికుమార్​, రమేశ్​లకు అమ్మారు. మిగిలిన భూమిని కూడా వారికే అమ్ముతామని చెప్పి సగం డబ్బులు తీసుకున్నారు. గడువులోగా మిగిలిన డబ్బులు ఇవ్వకుండా, తెలియకుండానే రెండున్నర ఎకరాలకు పట్టా చేయించుకున్నారు. 

విషయం తెలుసుకుని తహసీల్దార్ దగ్గరకు వెళ్తే పట్టించుకోలేదు. పైగా రాంబాబు, హరికుమార్​, రమేశ్​కలిసి గురువారం ప్రియాంక ఆమె భర్తపై దాడి చేశారు. దీనిపై చుంచుపల్లి పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ఇస్తే స్పందించలేదు. రెవెన్యూ, పోలీస్​ఆఫీసర్లు సహకరించకపోవడంతో చివరకు తప్పని పరిస్థితుల్లోనే రోడ్డుపై పడుకొని నిరసన తెలపాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయింది. ఒకవేళ తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్​ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.  దీనిపై తహసీల్దార్​కృష్ణను వివరణ కోరగా భూమికి కు సంబంధించి తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పారు. విషయం తెలుసుకుంటే ఆ ల్యాండ్ కోర్టు గొడవలో ఉందని తెలిసిందన్నారు. శనివారం ఫీల్డ్ మీదికి వెళ్లి పూర్తిస్థాయి విచారణ జరుపుతామన్నారు.