మాస్క్ సరిగాపెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి

మాస్క్ సరిగాపెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి

మాస్క్ ... ఇప్పుడు ప్రతీ ఒకరి జీవితంలో భాగమైంది. కరోనా వైరస్ పుణ్యమా అని మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అధికారులు కూడా మాస్క్ మస్ట్ అని హెచ్చరిస్తూనే ఉన్నారు. మాస్క్ లేకుండా బస్సు ఎక్కినా రైలు ఎక్కినా ఫైన్లు వేస్తున్నారు. ఆఫీసుల్లో, రద్దీ ప్రాంతాల్లో కూడా మాస్క్ తప్పకుండా పెట్టాలని కండిషన్స్ పెట్టారు. అయితే కొందరు మాస్క్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారితో అనుచితంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విమానంలో జరిగింది.ఫ్లైట్ లో మాస్క్‌ విషయంలో ఓ వృద్ధుడు, యువతికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో యువతి వృద్ధుడిపై చివరకు పిడిగుద్దులకు దారితీసింది. పట్టరాని కోపంతో ఊగిపోయిన యువతి ఆ వృద్ధుడి చెంప పగలగొట్టి, ముఖంపై ఉమ్మి వేసింది. 

వివరాల్లోకి వెళ్తే తంపా నుంచి అట్లాంటా వెళ్తున్న డెల్టా విమానంలో ఈ నెల 23న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 8 లక్షల మందికిపైగా వీక్షించారు. రెస్ట్‌రూమ్‌ వాడుకుని వచ్చి నిలబడిన యువతిని.. విమాన సహాయకుడు కూర్చోమని కోరగా.. పక్కనే ఉన్న వృద్ధుడు ఆమెను మాస్క్‌(గడ్డం కిందకు ఉంది) పైకి పెట్టుకోవాలని తిట్టాడు. ఆ సమయంలో ఆయన కూడా మాస్క్‌ను గడ్డం కిందకు పెట్టుకుని ఉండడంతో ఆ మహిళ అతనితో వాదనకు దిగింది. ఆయన తాను భోజనం చేస్తున్నాను కాబట్టి మాస్క్‌ కిందకు ఉందని బదులిచ్చాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకున్నారు. ఆగ్రహించిన ఆ యువతి.. వృద్ధుడి చెంపపై కొట్టి, ముఖంపై ఉమ్ము ఊసింది. దీంతో ఆయన అట్లాంటాలో దిగగానే నువ్వు జైలులో ఉంటావని యువతిని హెచ్చరించాడు. అయితే విమానంలో జరిగిన గొడవపై డెల్టా విమానయాన సంస్థ ఫిర్యాదు మేరకు వృద్ధుడిని కొట్టిన యువతిని అట్లాంటా పోలీసులు అరెస్టు చేశారు.