
హైదరాబాద్ సిటీ, వెలుగు: కారులో ఉన్న మహిళను మాటల్లో పెట్టి ఓ కేటుగాటు డబ్బులు లూటీ చేశాడు. తల్లి వైద్యానికి బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ఈ డబ్బులు క్షణాల్లో మాయం కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వికారాబాద్‌జిల్లా బొంరాస్ పేట మండలం బురాన్‌పూర్ తండాకు చెందిన రాజు, శారద దంపతులు. శారద తల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్య ఖర్చుల కోసం దంపతులిద్దరూ తమ బిడ్డతో కలిసి బంగారం తాకట్టు పెట్టేందుకు బుధవారం కారులో తాండూరుకు వెళ్లారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం పెట్టి రూ. 1.29 లక్షల లోన్ తీసుకున్నారు.
అనంతరం వీటిని తీసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా, హెచ్‌బీ కాంప్లెక్స్ వద్ద కారు టైర్‌పంక్చర్ అయ్యింది. దీంతో భర్త రాజు టైర్‌ను విడదీసి భార్య శారద, పాపను కారులోనే ఉంచి పంక్చర్ చేయించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ కేటుగాడు కారులో ఉన్న శారదను మాటల్లో పెట్టాడు. కారుకు టైరు లేకపోవడంతో కిందకు ఒంగుతుందని, బయటకు రావాలని చెప్పాడు. దీంతో శారద తన పాపతో కలిసి కిందకు దిగగా, కారులో ఉన్న క్యాష్ బ్యాగ్‌ను తీసుకొని నిందితుడు పరారరయ్యాడు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టినట్టు తాండూరు సీఐ సంతోశ్ తెలిపారు.