చందానగర్, వెలుగు: బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఓ మహిళకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆరో ఆడిషనల్ జడ్జీ పావని జీవితకాలం జైలు శిక్ష, రూ. మూడు వేల ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పారు. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లోని విల్లా నంబర్ 95లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడు, తల్లి ఉమాదేవి (69) కలిసి ఉంటున్నాడు. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా పుల్లపాడు గ్రామానికి చెందిన వసుంధర లక్ష్మి ఇదే విల్లా నంబర్ 96లో పనిమనిషిగా చేస్తోంది. 2016 సెప్టెంబర్ 9న శ్రీనివాస్ భార్య సునీతతో కలిసి కుమారుడిని స్కూల్‌లో డ్రాప్ చేసి ఆఫీస్‌కు వెళ్లాడు.
దీంతో విల్లాలో ఉమాదేవి ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు వసుంధర లక్ష్మీ శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి బంగారు అభరణాలు దొంగలించే ప్రయత్నం చేయగా గమనించిన ఉమాదేవి అడ్డుకుంది. దీంతో వసుంధర లక్ష్మి డైనింగ్ టేబుల్‌పైన ఉన్న కత్తితో ఉమాదేవిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే శ్రీనివాస్‌కు ఫోన్ చేశారు. అతడు ఇంటికి చేరుకొని స్థానికులు, పోలీసులతో కలిసి మెయిన్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు.
పక్కనే ఉన్న కిటికిలో నుంచి చూడగా ఉమాదేవి రక్తపు మడుగులో పడిపోయి, ఆమె పక్కన వసుంధర లక్ష్మి కత్తితో కనిపించింది. మెయిన్ డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లడంతో భయపడిన వసుంధర లక్ష్మి కత్తితో కడుపులో పొడుచుకొని, చేతులను గాయపర్చుకుంది. స్పందించిన పోలీసులు ఉమాదేవిని, వసుంధర లక్ష్మిని నల్లగండ్లలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా ఉమాదేవి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శ్రీనివాస ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు వసుంధర లక్ష్మీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ అనంతరం వసుంధరలక్ష్మికి జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.