దేశంలో గన్ కల్చర్ విస్తృతంగా పెరుగుతోంది. అందునా నేర ప్రవృత్తి పెరుగుతున్న ఈ రోజుల్లో.. ఎవరి మీద ఎవరు? ఎప్పుడు? ఎందుకు? దాడి చేస్తున్నారో అంతుపట్టడం లేదు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగిస్తున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. వివాహితో పరిచయం ఉన్న ఓ వ్యక్తి.. సడెన్‌గా బాధితురాలి ఇంటికొచ్చి.. ఆమెను గన్ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపారు. అనంతరం కాసేపటికే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన ఢిల్లీలోని డబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు రేణు గోయల్.. భర్త, పిల్లలతో కలిసి డబ్రీ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె జిమ్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతంలో నివాసముండే ఆశిష్ అనే 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంలో వారి మధ్య ఏం జరిగిందో కానీ, ఆశీష్ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి రేణు ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమె తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి కాల్చి చంపాడు. అనంతరం అక్కడ నుండి పరారయ్యాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి నివాసం దగ్గర ఉన్న సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా.. నిందితుడిని ఆశీష్ గా గుర్తించారు. అరెస్ట్ చేయడానికి అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాటు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరికి ఏళ్ల నుంచి పరిచయం ఉండటం.. వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఘటన జరిగిండొచ్చని పోలీసులు అనుమనిస్తున్నారు. అతడు ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.