
- ఉద్యోగం ఇప్పిస్తానని అసభ్య మెసేజ్‌లు?
- ఇంటికి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి దేహశుద్ధి
- సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన
సంగారెడ్డి, వెలుగు : సదాశివపేటకు చెందిన బీఆర్ఎస్ లీడర్ఆత్మకూర్ నగేశ్ ఓ యువతి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నారు. యువతి ఆయనను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. సదాశివపేటలో గత నెలలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగేశ్ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. అంతకుముందు జాబ్ మేళా పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ యువతికి అసభ్యకర మెసేజ్ లు పంపినట్టు తెలిసింది. ఆమె అల్లరి చేయకుండా నగేశ్ ను ఇంటికి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి మరీ కుటుంబసభ్యుల సమక్షంలోనే చెప్పుతో కొట్టింది. కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ గురువారం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బయటపడింది.
ఒకరికి పంపబోయి మరొకరికి పంపిన : నగేశ్
తన ఫ్రెండ్ అయిన ఓ ఎన్నారై మహిళకు పంపాల్సిన మెసేజ్‌ను పొరపాటున ఒకే పేరుతో ఉన్న యువతి ఫోన్‌కు వెళ్లిందని ఆత్మకూర్ నగేశ్ సంజాయిషీ ఇచ్చారు. అమెరికాలో ఉన్న టైంలో ఆ మహిళతో తనకు పరిచయం ఏర్పడి స్నేహంగా మారిందన్నారు. సదరు మహిళ హైదరాబాద్ రావడంతో తనను కలవాలని కోరిన నేపథ్యంలో హోటల్లో కలుద్దామని మెసేజ్ పెట్టానని చెప్పాడు. కానీ, పొరపాటున యువతి ఫోన్‌కు వెళ్లిన మెసేజ్ డిలీట్ చేసి సారీ చెప్పినప్పటికీ ఆ యువతి ఇంటికి పిలిచి కొట్టిందన్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నగేశ్ తెలిపాడు.