మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్టేషన్ దగ్గరలోని హమాలీవాడలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, బండతో మోది చంపారు. జిల్లా కేంద్రం లోని గోపాల్వాడకు చెందిన బత్తిని శరణ్య(28) బెల్లంపల్లి చౌరస్తా దగ్గర్లోని మెడిలైఫ్ హాస్పిటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని హమాలీవాడ మీదుగా ఇంటికి వెళ్తుండగా రైల్వేస్టేషన్ క్యాబిన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తితో గొంతులో పొడిచి, తలపై బండతో మోది హత్య చేశారు.
మంచిర్యాలకు చెందిన మహ్మద్ జియా, శరణ్య 2012లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి కూతురు మనస్విని (9) ఉంది. జియా సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నాడు. కుటుంబ గొడవల కారణంగా వీరిద్దరు ఐదేండ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. శరణ్య తన కూతురుతో కలిసి తల్లి దగ్గర ఉంటూ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఘటనా స్థలాన్ని డీసీపీ సుధీర్ కేకన్ రాంనాథ్, పోలీసులు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.