జీడిమెట్లలో దర్జాగా ఇంట్లోకి వచ్చి దొంగతనం.. బీరువాలో నుంచి ఆభరణాలు ఎత్తుకెళ్లిన మహిళ

జీడిమెట్లలో దర్జాగా ఇంట్లోకి వచ్చి దొంగతనం.. బీరువాలో నుంచి ఆభరణాలు ఎత్తుకెళ్లిన మహిళ

జీడిమెట్ల, వెలుగు: పట్టపగలే దర్జాగా మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. బాధితులు తేరుకొని పట్టుకునేలోగా అక్కడ్నుంచి ఉడాయించింది. సీఐ నర్సింహ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలోని అల్విన్​కాలనీకి చెందిన సుదర్శన్​వృద్ధుడు. తన ఇంటి పక్కన సివిల్​వర్క్ జరుగుతుండగా,  బుధవారం సాయంత్రం ఇంటి డోర్స్​ఓపెన్​చేసి, పని వారితో మాట్లాడుతున్నాడు. అతని భార్య ఇంటి వెనకాల పనిలో ఉంది. 

ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ ఇంట్లోకి ప్రవేశించి  బీరువాలో వెతుకుతుండగా, శబ్ధం విని సుదర్శన్​వచ్చి చూశాడు.  అప్పటికే మహిళ బీరువాలోని 7 తులాల బంగారం, 10 తులాల వెండిని తీసుకుని పారిపోతుండగా, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వృధాప్యం వల్ల ఆమెను నిలువరించలేకపోయాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి ముందు సదరు మహిళ ఓ ఫొటో షాప్​లో ఫొటోలు దిగి, వాటిని డిలిట్​ చేయించినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. 

జీడిమెట్లలో తాళం వేసి ఉన్న ఇంట్లో..

జీడిమెట్లలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. అపురూపకాలనీకి చెందిన పింటూ హుడైట్​బిజినెస్​ చేస్తున్నాడు. ఈ నెల 5న కలకత్తాలో తమ బంధువుల వివాహం ఉండడంతో తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. రాత్రి దొంగలు పడి తన ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు నగలు, అర కిలో వెండి, 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.