- కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్
- ఎగ్జామ్ రాశాక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన
- గ్రూప్ 2కు రాష్ట్రవ్యాప్తంగా 45.57% హాజరు
నాగర్ కర్నూల్, వెలుగు: పురిటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్- 2 పరీక్ష రాసింది. ఏ టైమ్‌లో అయినా డెలివరీ జరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఎగ్జామ్ సెంటర్లోనే అధికారులు 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. సదరు గర్భిణి పట్టుదల చూసి కలెక్టర్ సంతోష్, అధికారులు ఆమెకు అండగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన 25 ఏండ్ల రేవతి నిండు గర్భిణి. డాక్టర్లు ఆమెకు సోమవారమే డెలివరీ డేట్ ఇచ్చారు. అయినప్పటికీ.. ఆమె ఆదివారం పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాసింది. సోమవారం ఉదయం ఎగ్జామ్ రాస్తున్నప్పుడే రేవతికి పురిటి నొప్పులు వచ్చాయి.
దీంతో ఎగ్జామ్ సెంటర్లోని అధికారులు, సిబ్బంది స్పందించి.. హాస్పిటల్ వెళ్లాల్సిందిగా సూచించారు. తాను పరీక్ష రాసిన తర్వాతే హాస్పిటల్ వెళ్తానని చెప్పడంతో.. ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు రేవతి వద్ద ఏఎన్ఎంను కూర్చోబెట్టారు. అదేవిధంగా, డెలివరీకి అవసరమయ్యే అన్ని మందులను ఎగ్జామ్ సెంటర్ ఆవరణలోని 108 అంబులెన్స్‌లో ఉంచారు. డెలివరీ చేసేందుకు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకున్నారు. పురిటి నొప్పుల విషయాన్ని రేవతి తల్లి, అత్తయ్య, భర్తకు చెప్పడంతో.. వాళ్లు వెంటనే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పురిటి నొప్పులు భరిస్తూనే రేవతి.. పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ రాసింది. తర్వాత 108 అంబులెన్స్‌లో ఆమెను నాగర్‌కర్నూల్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి రేవతి పరీక్ష రాసేందుకు వచ్చింది.