ఎవరికీ ట్వీట్ చేయనవసరం లేదు.. తాళిబొట్టు ఉంటే చాలు


సమాజంలో చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ప్రభుత్వ పాలనను వెక్కిరించే స్థాయిలో సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా తగిన ప్రాధాన్యత దక్కకుండా, సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మామూలు ఘటనల్లా ఒకట్రెండు రోజుల జ్ఞాపకంగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే పోతున్నాయి. అయితే వాటి మూలాల్ని, కారణాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలేమిటో పట్టుకుంటే గాని సమస్యకు సమాధానం దొరకదు.

నిరసన గళాలు పెరుగుతున్నయ్

తెలంగాణలో కొలువులు రాక నిరుద్యోగుల ఆత్మ బలిదానాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలు రాష్ట్ర పాలనను నిలువుటద్దంలో చూపిస్తున్నాయి. ప్రగతిభవన్ ముందు పెట్రోల్ సీసాలతో ప్రత్యక్షమవుతున్నవారి సంఖ్య తక్కువేమీ లేదు. ఇటీవల ఒక గిరిజన మహిళ సాగు భూమిపై హక్కు లేదన్న అటవీశాఖ ఉద్యోగిపై పెట్రోల్ చల్లి తనపైనా పోసుకున్న వార్త చూశాం. ఈ సంఘటనలు విడివిడిగా కాక వరుసగా పేర్చి చూస్తే వాటి దగడేమిటో అర్థమవుతుంది. ఇదే తరహాలో ప్రభుత్వ అధికారులతో జనం ఎంతగా కష్టాలపాలవుతున్నారో తెలియజేసే సంఘటన ఒకటి వార్తలకెక్కింది. ఒక మహిళ తన భూ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి తన మంగళసూత్రాన్నే తహసీల్దారు ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏం చెల్లించుకోలేను. దానిని తీసుకుని తన పని చేసి పెట్టండని వేడుకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ.

వ్యవస్థకే షాకిచ్చిన ఘటన

పదేండ్ల క్రితం గల్ఫ్ వెళ్లిన మంగ భర్త రాజేశం ఎక్కడ ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్ పల్లిలోని పుట్టినింటిలో ఉంటూ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదనుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఆమె వాదన. రెండేండ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో తెలియక ఆమె ఈ కఠిన నిర్ణయానికి పాల్పడింది. విషయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దాకా వెళ్లడంతో ఆర్డీవోను ఆ సంగతేమిటో చూడమని పురమాయించారు. ఆ అధికారి మంగను కలిసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువుప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. నిజానికిది మొత్తం వ్యవస్థకే షాకిచ్చే సంఘటన అయినా రెండ్రోజులకే  మరుగున పడిన వార్త అయింది.

మంగకు అండగా నిలవాలి

ఆడవారి ఇబ్బందులకు స్పందించే మహిళా సంఘాలు ఇప్పుడు మంగను ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉంది. ఆమె తెగువను మెచ్చుకొని ఆదర్శ మహిళగా గుర్తించాలి. ధీరవనితగా ఆమెను సత్కరించి తాను చేసింది ఒక నూతన ఒరవడి అని ఆమె గ్రహించేలా చేయాలి. తన అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇవ్వాల్సిన సందర్భమిది. సమావేశాలకు ఆహ్వానించి ఆమెతో మాట్లాడించాలి. మెడలో తాళిబొట్టు ఉంటే చాలు ఇక ఎవరికీ ట్వీట్ చేయనవసరం లేదనే ధైర్యం నూరిపోయాలి. అధికారులు ఆమెకిచ్చిన హామీ నెరవేరేలా చూడాలి. ఆమె అభ్యర్థనలో వాస్తవాన్ని తెలుసుకొని అది నెరవేరేలా న్యాయ సహాయం అందించాలి. ఏదో లిటిగేషన్ పెట్టి ఆమెపై రెవెన్యూ సిబ్బంది కక్ష సాధింపునకు దిగకుండా చివరి దాకా తోడు అవసరం.  మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. మంగ చూపిన తెగువ ఒక నిరసన బాటగా అధికారులకు కనువిప్పుగా మలుచుకునే బాధ్యత నారీలోకంపైనే ఉంది. ఎందుకంటే ప్రభావశీల సంఘటనలు ఎప్పుడూ జరుగవు.

ఈ విధానం ఇతరులకూ ఆదర్శం

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమై వినూత్న రీతిలో తమ నిరసన ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంగ చూపించిన  తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. గతిలేక ఆత్మహత్యలు, ఉద్యోగులపై పెట్రోలు పోసి హత్యాయత్నం కేసు పాలవడాలు, తమపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి  సిద్ధపడటాలు అన్నీ వ్యక్తిగత ఇబ్బందులకు దారితీసేవే.  వీటి వల్ల ప్రభుత్వానికి, అధికారులకు చీమ కుట్టినట్లైనా ఉండదు. మంగ చేసినది మాత్రం ఒక వినూత్న నిరసన. ఈ విధానం ఒక ఆయుధంగా మారాలి. అందుకే దీనిని సాధారణ రీతిలో మరిచిపోయే సంఘటనగా జారిపోనివ్వకూడదు. గమనించే మనసుంటే మంగ మహిళా నిరసనకు ఓ నూతన అధ్యాయానికి తెర లేపిందని ఒప్పుకోవాలి. మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇదొక ఒంటరి యుద్ధ తంత్రం కావాలి. మెడలో తాళిబొట్టు ఉన్న మహిళతో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించే స్థాయికి దీన్ని తీసుకెళ్లవచ్చు.

శ్రీనివాస్ చిరిపోతుల

వెంకటేశ్వర్లపల్లి,భూపాలపల్లి