
- జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ
- 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు
- 59 శాతం మంది క్వాలిఫై.. 8,463 మంది డిస్క్వాలిఫై
- త్వరలోనే జీఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్,వెలుగు: గ్రూప్ –1 సర్వీసెస్ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్) రిలీజ్ అయింది. మొత్తం 12,622 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్లో ర్యాంకుల వివరాలను ప్రకటించింది. పరీక్ష రాసిన వారిలో 59.86 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మల్టీజోన్ –2 కు చెందిన మహిళా అభ్యర్థి 550 మార్కులతో గ్రూప్–1 టాపర్గా నిలిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ నెలాఖరులో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి.
ఈ పరీక్షలకు 31,403 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేయగా, వారిలో 21,093 మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ నెల10న గ్రూప్–1 పరీక్షకు అటెండ్ అయిన అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల లిస్ట్‌ను కమిషన్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల10 నుంచి 24 వ తేదీ వరకు మార్కుల రీకౌంటింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది.
ఏప్రిల్ 28 వరకు అందుబాటులో జీఆర్ఎల్లిస్ట్
శనివారం (మార్చి 30) టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఉగాది సందర్భంగా గ్రూప్–1 జీఆర్ ఎల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ లిస్ట్‌ను కమిషన్ వెబ్ సైట్లో పెట్టారు. ఇందులో ప్రత్యేకంగా క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో (150 మార్కులు) వచ్చిన మార్కులతో పాటు 6 సబ్జెక్టుల్లోని (900) మార్కులను చూపించారు. ఈ మార్కుల వివరాలు ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేస్తే.. వ్యక్తిగత లాగిన్‌లో సబ్జెక్టుల వారీగా మార్కులను తెలుసుకోవచ్చు. కమిషన్ వెబ్ సైట్లో ఏప్రిల్ 28 వరకు జీఆర్ఎల్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది. దీని ఆధారంగానే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పికప్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏమైనా టెక్నికల్ సమస్యలుంటే అభ్యర్థులు 040–-23542185 లేదా 040–-23542187 నెంబర్లకు కాల్ చేయాలని, లేదంటే helpdesk@tspsc.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు.
అమ్మాయిల సత్తా..
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ -–1 జనరల్ ర్యాంకింగ్స్ లో టాపర్ గా ఓ మహిళ క్యాండిడేట్ నిలిచారు. మల్టీ జోన్ 2 కు చెందిన ఓసీ అమ్మాయికి మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులు వచ్చాయి. ఆ తర్వాతి రెండు స్థానాల్లో పురుషులు ఉండగా.. టాప్ –10 లో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. 525 మార్కులకు పైగా ఆరుగురికి వచ్చాయి. 52 మంది అభ్యర్థులకు 500 లకు పైగా మార్కులు వచ్చాయి.
టాప్–10లో ముగ్గురు బీసీలు ఉండగా, ఏడుగురు ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్ –1 మెయిన్స్ లో 12,622 మంది క్వాలిఫై అయినట్టు అధికారులు ప్రకటించారు. వీరికి సంబంధించిన జీఆర్ఎల్ వివరాలనే వెబ్ సైట్లో పెట్టారు. దీంతో మరో 8,463 మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదని తెలుస్తున్నది. ఇంగ్లిష్ పరీక్షలో 150 మార్కుల్లో జనరల్ కేటగిరీ విద్యార్థులకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 30శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై చేశారు. దీనికితోడు మిగిలిన 6 సబ్జెక్టుల్లో ఓవరాల్ మార్కుల్లోనూ ఇదే విధానం అమలు చేశారు. దీంతో 8 వేలకు పైగా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు.