బషీర్ బాగ్, వెలుగు: లాభాలు ఆశ చూపి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 37 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగినికి తొలుత వర్క్ ఫ్రమ్ హోం ఉందంటూ సైబర్ చీటర్స్ వాట్సాప్ మెసేజ్ చేశారు.
తమను 3ఐ ఇన్ఫోటెక్ ప్రతినిధిగా పరిచయం చేసుకొని, తాము చెప్పిన రెస్టారెంట్లకు గూగుల్ ద్వారా రివ్యూలు, రేటింగ్ ఇవ్వాలన్నారు. దీంతో స్కామర్లు చెప్పిన టాస్క్ లను బాధితురాలు పూర్తి చేసి స్క్రీన్ షాట్లు పంపగా, ఆమెకు కొంత నగదు బదిలీ చేశారు.
అనంతరం అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో బాధితురాలు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేయగా, స్కామర్లు కొంతసేపటికి రూ.3,800 చెల్లించారు. తరువాత టెక్నీకల్ సమస్య ఉందని బాధిత మహిళ నంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు.
యూ కాయిన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఆ గ్రూప్ లో లాభాలు పొందినట్లు ఇతర సభ్యుల స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. దీంతో నిజమని నమ్మిన మహిళ పలు దఫాలుగా రూ. 11.92 లక్షలు పెట్టుబడి పెట్టింది.
వాటికి లాభాలు చెల్లించకుండా ఇంకా పెట్టుబడి పెట్టాలని స్కామర్లు ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు గ్రహించి బుధవారంసైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.