భూ సమస్య పరిష్కరించాలని పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌కు..

సూర్యాపేట, వెలుగు: భూ సమస్యను పరిష్కరించడంలో మండల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సూర్యాపేట కలెక్టరేట్‌కు ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో వచ్చింది. దీన్ని గుర్తించిన పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. చివ్వెంల గ్రామానికి చెందిన సుంకిరెడ్డి సుశీలమ్మకు గ్రామ సర్వే నెంబర్‌17,19,21 సర్వే నెంబర్లలో మూడు ఎకరాల భూమి ఉంది. దాదాపు 50 ఏండ్లుగా వారి కుటుంబం సాగులోనే ఉంది. ఆమె పేరుపై 2012లో రిజిస్ట్రేషన్‌ కాగా, నేటికీ పట్టాదారు పాస్‌బుక్​మాత్రం రాలేదు.

సుశీలమ్మ వయసు పైబడి ఎటూ వెళ్లడానికి రావడం లేదు. దీంతో కొన్ని నెలలుగా ఆమె కూతురు పూలమ్మ తన తల్లి పేరుపై పట్టా చేయాలని కోరుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. గతంలో ఈ విషయమై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయగా భూమిని పరిశీలించి పట్టా చేయాలని అడిషనల్​కలెక్టర్‌ ఆదేశించినట్టు బాధితురాలు చెప్పింది. అయినా మండల అధికారులు స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు సోమవారం పురుగుల మందు డబ్బా తెచ్చుకున్నట్టు చెప్పింది. దీంతో అడిషనల్ కలెక్టర్‌ వెంకట్ రెడ్డి స్పందించి సమస్యను సాధ్యమైనంత తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.