వనపర్తి, వెలుగు: ఊలు దారాలతో మహిళలు ధరించే క్రోచెట్ పొంచోస్ లను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్న మహిళకు ఆదివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో సన్మానించారు. వనపర్తికి చెందిన మారం ప్రశాంతిని ఆదివారం ఆమె నివాసంలో శాలువా, పూలమాల, జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహిస్తే వారు సాధించలేని రంగమే లేదన్నారు.
విశాఖపట్నం మహిళా మనో వికాస సంస్థ ఆధ్వర్యంలో ఊలు దారాలతో క్రోచెట్ పొంచోస్ లు తయారు చేసి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఇలా తయారు చేసిన వస్త్రాలను గిరిజన మహిళలకు ఉచితంగా అందజేయడం సేవా నిరతికి నిదర్శనమన్నారు. మారం ప్రశాంతి తన హస్త కళా నైపుణ్యంతో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్ర శేఖర్, డి. రాములు, చెన్నపద్మ, పొల్కంపల్లి సుజాత, విజయ్ కుమార్ పాల్గొన్నారు.