
ఇండియా రెజ్లర్ నిషా దహియా.. మెగా గేమ్స్‌లో గాయం కారణంగా ఓటమిపాలైంది. సోమవారం జరిగిన విమెన్స్ 68 కేజీ ఫ్రీస్టయిల్ క్వార్టర్‌ఫైనల్లో 8–10తో పాక్ సోగమ్ (నార్త్ కొరియా) చేతిలో ఓడింది. ఆరంభంలో అద్భుతమైన పట్టుతో ఆకట్టుకున్న ఇండియా రెజ్లర్ 8–1 లీడ్‌లో నిలిచింది. కానీ 90 సెకండ్లలో బౌట్ ముగుస్తుందనగా నిషా కుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో నొప్పితో ఇబ్బందిపడిన రెజ్లర్ మెడికల్ బ్రేక్ తీసుకుంది.
తర్వాత మళ్లీ బరిలోకి దిగినా మునుపటి పట్టును చూపలేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సోగమ్ చకచకా పాయింట్లు నెగ్గింది. చివరి 10 సెకండ్లలో స్కోరు 8–8తో ఉండగా, నిషా కుడి చేతిలో బలం లేకపోవడంతో బౌట్‌ను చేజార్చుకుంది. బౌట్ తర్వాత నిషా కన్నీళ్ల పర్యంతమైంది. ఒకవేళ సో గమ్ ఫైనల్‌కు చేరుకుంటే నిషాకు రెపిచేజ్ ఆడే చాన్స్ లభిస్తుంది. అయితే గాయంతో ఆమె బరిలోకి దిగుతుందా? లేదా? చూడాలి. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నిషా 6-–4తో సోవా రిజాకో (ఉక్రెయిన్)పై గెలిచింది.