కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్నది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనున్నది.
– 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతం మహిళలతో 121.1కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8 శాతం మహిళలతో 152.2 కోట్లకు చేరనున్నది. ఇదే సమయంలో 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారి సంఖ్య కొంత తగ్గనున్నది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందు ప్రధాన కారణం.
ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనున్నది. దాని వల్ల జనాభా పిరమిడ్లో 2036 వరకు అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పరిమిడ్లో ప్రాథమిక భాగం తగ్గిపోయి, మధ్యస్థాయి భాగం విస్తృతం కానున్నది.
నివేదికలో ముఖ్యాంశాలు
2036 నాటికి పనిచేసే వయసున్న జనాభా పెరుగుతుంది. 2011 నాటికి 60.7 శాతం జనాభా 15–59 ఏళ్ల మధ్య ఉండగా, 2036 నాటికి ఇది 64.9 శాతానికి చేరనున్నది.
2011తో పోలిస్తే 2036 నాటికి జనాభాలో మహిళల నిష్పత్తి పెరగనున్నది. 2011 నాటికి ప్రతి 1000 మందికి 943 మంది ఉన్న మహిళలు 2036 నాటికి 952కు చేరుతారు. ఇది లింగ సమానత్వానికి సానుకూల సంకేతం.
2011–36 మధ్యకాలంలో పట్టణ జనాభా 37.7 కోట్ల నుంచి 59.4 కోట్లకు, గ్రామీణ జనాభా 83.3 కోట్ల నుంచి 92.7 కోట్లకు చేరనున్నది.
2011 జనాభాలో 10 నుంచి 14 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా 10.8 శాతం ఉండగా 2036 నాటికి 35 – 39 ఏళ్ల వయస్సు వారి సంఖ్య అత్యధికం (8.3 శాతం) కానున్నది. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.5 శాతం నుంచి 1.5 శాతానికి పెరగనున్నది.