- లోకల్ బాడీ ఎన్నికల్లో వారిదే కీరోల్
- పెరిగిన ఓటర్లు 28 వేలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఎప్పటిలాగే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ సెగ్మెంట్లోని కొన్ని మండలాలున్నాయి. తుది ఓటర్ల జాబితాను అధికారులు ఇటీవల ప్రకటించారు. తాజాగా జిల్లాలో 14,35,214 మంది ఓటర్లుండగా పురుషులకన్నా 80,875 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టు లెక్క తేలింది.
మహిళల తర్వాత యువ ఓటర్లే కీలకం కానున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారు 26 వేల వరకు ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువతీయువకులే దాదాపు సగం వరకు ఉన్నారు. కొత్త జాబితా ప్రకారం 18 నుంచి 39 ఏండ్ల మధ్య వయస్సున్న ఓటర్ల సంఖ్య 6, 96,014. దీంతో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలు, యువతే కీలకం కానున్నారు.
పెరిగిన ఓటర్లు
జిల్లాలో మొత్తం ఓటర్లు 14,35,214 కాగా ఇందులో పురుషులు 6,77,130, మహిళలు 7,58,005, ట్రాన్స్జెండర్లు 79 మంది, సర్వీస్ ఓటర్లుగా 804 మంది నమోదయ్యారు. కొత్తగా 28,429 మంది తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోగా.. బూత్‌లెవల్ అధికారులు ఫీల్డ్ విజిట్‌చేసి చనిపోయినవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన 5,474 మంది పేర్లను జాబితాలోంచి తొలగించారు.
గత పార్లమెంట్ ఎన్నికల టైమ్‌లో 14,06,785 ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య14,35,214కు పెరిగింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ 3,07,459 ఓటర్లతో పెద్ద నియోజకవర్గంగా నిలబడింది. 2,60,485 ఓటర్లతో రూరల్ సెగ్మెంట్ రెండో స్థానం ఉంది. బాల్కొండ సెగ్మెంట్లో 2,29,624 మంది ఓటర్లు, బోధన్ నియోజకవర్గంలో 2,24,772, ఆర్మూర్‌లో 2,14,136, బాన్సువాడలో 1,98,738 మంది ఓటర్లున్నారు.
లోకల్ బాడీస్‌లో హవా..
బీసీ గణనకు సంబంధించి కమిషన్ల రిపోర్టులు రాగానే రిజర్వేషన్లు పెంచి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ఫిబ్రవరిలోనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. జులైలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా మాజీలయ్యారు. ఈనెలలో మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిళ్ల టర్మ్ పూర్తికానుంది. దీంతో రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు వరుసగా ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా 15 గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో జిల్లాలో జీపీల సంఖ్య 545 పెరిగింది.
జీపీలతో పాటు వాటి పరిధిలోని 5,022 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లతో పాటు పేపర్ బ్యాలెట్ రెడీ చేశారు. పల్లెల్లో 8,30,580 ఓటర్లుండగా 5,033 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏడాది కింద ఏర్పాటయిన ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా, పోతంగల్తో కలిపి జిల్లాలో 31 మండలాలున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలన్నింటిలోనూ యువత, మహిళలే నిర్ణేతలు కానున్నారు. వారు ఎవరివైపు మొగ్గు చూపితే వాళ్లే అందలమెక్కే చాన్స్ ఉంది.