మహిళలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే

ఓ పక్క మహిళపై హింసను అరికట్టడం ఎలా అనే చర్చలు జరుగుతుంటే మరో పక్క జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్ హెచ్ఎస్ -5 ఇటీవల షాక్ కొట్టే గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు ‘అవసరమైతే భర్త భార్యను కొట్టొచ్చు’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టు ఆడవాళ్ల కన్నా కొంచెం నయంగా 44 శాతం మగవాళ్లు కొట్టడాన్ని సమర్థించారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఎన్ఎఫ్ హెచ్ఎస్ -4 సర్వే ప్రకారం మహిళల్లో 7 శాతం తగ్గితే, నిస్సంకోచంగా కొట్టొచ్చు అనే మగవాళ్లు 2 శాతం పెరిగారు. ప్రపంచం అంతా ఎటు పోయినా మనం మాత్రం ఇంతే అన్నట్టుగా.. గృహహింస, మహిళపై హింసను అరికట్టాలి అంటూ ఉద్యమకారులు ఎన్ని ప్రసంగాలు చేసినా.. అదంతా వేదికలకే పరిమితమై, నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగినా, మార్పు రాకపోగా మేము వెనకే నడుస్తాం అంటున్నారు దేశీయ మహిళలు. 

ఇందులో కూడా మనమే ముందు..
సాధారణంగా మన తెలుగు వాళ్లు కొత్తను ఆహ్వానించడంలో మిగిలిన వారి కన్న చాలా వేగం అంటుంటారు. దురదృష్టం... భార్యను కొట్టినా పర్వాలేదు అనడంలో కూడా మన తెలుగు రాష్ట్రాల మహిళలు ముందున్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ మహిళలు 83.8 శాతం, ఆంధ్రప్రదేశ్ మహిళలు 83.6 శాతం నిరభ్యంతరంగా తమ భర్తలు కొట్టినా పర్వాలేదన్నారు. పురుషుల్లో తెలంగాణలో 70.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 66.5 శాతం మంది ఆడవాళ్లని తన్ని తగలేసినా తప్పులేదని ఢంకా బజాయించారు. ఆ తర్వాత స్థానాల్లో  తమిళనాడు, కర్నాటక, కేరళ నిలిచి ఈ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలన్నీ ఐక్యత చాటుకున్నాయి. దక్షిణాదితో పోల్చుకుంటే ఉత్తర భారత౦ కొంత నయమనిపించింది. ఈ కొట్టడంలో మళ్లీ చెంప దెబ్బలకు ప్రథమ స్థానం ఇచ్చారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ‘కొట్టినా తప్పులేద’నే వారి శాతం ఎక్కువగా ఉంది. దీనికి విద్య, ప్రపంచ జ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం ఉంటే ఉండవచ్చు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం. తదితర సందర్భాల్లో కొట్టడం సహజం, మేము భరిస్తాం, అలాగే మేము కొడతాం అంటున్నారని సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ అభిప్రాయంలో మాత్రం ఆలుమగలు పోటీ పడకుండా సమాన శాతంతో సమానత్వ౦ పాటించారు. 

దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది 
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(1993 లో) గృహహింస(లింగ ఆధారిత) కు నిర్వచనం ఇస్తూ మొదటిసారిగా మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు అత్యవసర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఆ తర్వాత మహిళా సాధికారత ఎజెండాతో జరిగిన బీజింగ్(1995) డిక్లరేషన్ లో హింస గురించి కూడా మాట్లాడింది. తర్వాత జరిగిన పరిశోధనలు, అధ్యయనాలను డాక్యుమెంట్ చేసింది. కానీ ఎం లాభం? అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలతో ‘కాలర్’ ఎగరేసే దేశాల్లో మన దేశం కూడా ఉంది. అంతవరకే. హింస తగ్గి౦చడానికి ఏం చర్యలు తీసుకు౦ది? జెండర్ బడ్జెట్, ఉమెన్ మ్యానిఫెస్టోలు అంటారు. పథకాలన్నీ స్త్రీలకే అంటారు. మహిళా రిజర్వేషన్లు తెస్తారు. పెద్ద పీట వేశాం అంటారు. మహిళా సాధికారత దిశగా అంటారు. మరి మహిళల నుంచి ఇలాంటి అభిప్రాయాలు రావడానికి కారణాలు చెప్పడానికి ఎవరూ ఎందుకు సాహసించరు?  వీరి దగ్గర సమాధానం ఉండదు. వివిధ స్థాయిల్లో, అన్ని కుటుంబాల్లో ఆరోగ్య పరంగా, మానసికంగా స్త్రీలు నిశ్శబ్దంగా హింసను ఓర్చుకు౦టున్నారు. ఈ ప్రపంచంలో మరెక్కడా లేని రక్షణను ఇస్తు౦దనుకునే తమ సొంతింటి నుంచి ఈ హింసను మహిళలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ఇక మహిళ సాధికారతకు అర్థం ఎక్కడుంది?  

ఎలాంటి వాతావరణం ఉండాలంటే..
నిత్యం ఇంట్లో, బయట స్త్రీలపై జరుగుతున్న హింసలు ఎదుర్కోవాలంటే మహిళలు మరింత శక్తిమంతంగా మారాలి. తన కాళ్ల మీద తాను నిలబడి, తన కోసం తనచుట్టూ ఉన్న వాళ్ళ కోసం అవసరమైన సామాజిక మార్పుకు దోహదపడే హక్కు ఒకటి తమకుందని గ్రహించాలి. ఒకటి రెండు చేసేసి ఇదే సాధికారత అనే ప్రభుత్వాలను కూడా నిలదీయాలి. 

మరి సెక్షన్ 498(ఎ)...  
ఎన్నో ఉద్యమాలు, ఆలోచనలు, సంఘటనలు, వేదికలు, చర్చోపచర్చలు అనంతరం గృహహింస కు ఉపశమన౦గా 1983 నుంచి 498(ఎ) కింద కేసు నమోదు చేసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ (పీడబ్ల్యూడీవీఏ) 2005 పెళ్లయిన, పెళ్లికాని స్త్రీలను గృహహింస పరిధిలోకి తెచ్చింది. అయితే వీటి కింద నమోదయ్యే కేసుల సంఖ్య, గృహహింస తగ్గుదల, వాస్తవ పరిస్థితులు, ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఏటా విడుదల చేస్తున్న గణాంకాలపై మేధావులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై మహిళలపై హింస గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి చర్చల సారాంశం, చేస్తున్న చట్టాలు, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు ఇంకా అనుకున్నంత స్థాయిలో మహిళలకు, యువతులకు చేరలేదు కాబట్టే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా అన్నదే ఇప్పుడు పెద్ద సందేహం. మహిళల హింసకు సంబంధించి ఉన్న చట్టాలన్నీ ఇప్పుడు చట్ట బండలేనా అనిపిస్తోంది. 

ఎందుకీ నిరాసక్తత? 
18- నుంచి 34 సంవత్సరాల వయసు వారే అత్యధికంగా హింసను ఎదుర్కుంటున్నారు. ప్రతి10 మందిలో ముగ్గురు భర్తల నుంచే హింసకు గురవుతున్నారు. ఇందులో విద్యావంతులు ఉన్నారు. అయినా ఈ హింసను భరిస్తున్నారు అంటే ఇల్లే పదిలం అనుకోవడమేనా? చుట్టూ ఉన్న సమాజం, ప్రభుత్వాలు, సంస్కరణలు, చట్టాలు, ఇంతకన్నా మద్దతు ధైర్యాన్ని ఇవ్వవేమోనని అనుమానమా? లేక వారికి గుండెల నిండా ధైర్యాన్ని ఇవ్వగలిగే పెంపకాలు, విద్య వ్యవస్థ, రక్షణ వ్యవస్థ లేవనా? అన్ని ప్రశ్నలే.
- పండలనేని గాయత్రి, ఇండిపెండెంట్​ జర్నలిస్ట్