పొదుపులో మహిళలే బెస్ట్.. 18 శాతం మంది డబ్బును ఇంట్లోనే దాస్తున్నారు !

పొదుపులో మహిళలే బెస్ట్.. 18 శాతం మంది డబ్బును ఇంట్లోనే దాస్తున్నారు !
  • కుటుంబ, సామాజిక సమస్యలే కారణం.. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇది

న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో మనదేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన 8.9 కోట్ల మంది మహిళలు వివిధ బాధ్యతలు, సమస్యల కారణంగా పనులకు దూరంగా ఉండిపోయారు. చెన్నయ్​కు చెందిన గ్రేట్​లేక్స్ ​ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ మేనేజ్​మెంట్​‘ఇండియాస్​ జెండర్​ ఎంప్లాయ్​మెంట్​ పారడాక్స్’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడి చేసింది. దీని ప్రకారం.. ఇదేకాలంలో మహిళల ఉపాధి 10 శాతం పెరిగింది.

కంపెనీలు చదువుకున్న మహిళల నైపుణ్యాలను ఉపయోగించుకోలేకపోతున్నాయి. దీనివల్ల లింగసమానత్వం సాధ్యం కావడం లేదు. సామాజిక కట్టుబాట్లు, కుటుంబ పరమైన బాధ్యతల కారణంగా 1.9 కోట్ల మంది మహిళా గ్రాడ్యుయేట్లు నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. వారి చదువు కోసం చేసిన ఖర్చు వృథా అవుతోంది. పిల్లలను చూసుకోవాల్సి రావడం, రాత్రి వేళల్లో పనిచేయాల్సిన పరిస్థితులు, ప్రయాణ సంబంధిత ఇబ్బందుల వల్ల హైక్వాలిఫైడ్ మహిళలు కూడా ఉద్యోగాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది.

ఉన్నత చదువులు గల కుటుంబాల్లోనూ లింగసమానత్వం ఉండటం లేదు. భార్యాభర్తలు పనిచేసే కుటుంబాల్లోనూ ఇది కనిపిస్తోంది. 62 శాతం కుటుంబాల్లో ఇద్దరికీ ఒకే తరహా విద్యార్హతలు ఉన్నప్పటికీ మగవారి సంపాదన ఎక్కువ ఉంటోంది. 41 శాతం కుటుంబాల్లో మహిళలు ఉద్యోగం చేయడంతోపాటు ఇంటి పనులూ చక్కబెడుతున్నారు. రెండు శాతం మంది భర్తలు మాత్రమే ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసే తల్లుల్లో 86 శాతం మంది ఎక్కువ సమయాన్ని పిల్లలను చూసుకోవడానికి కేటాయిస్తున్నారు. తమకు కుటుంబం నుంచి తగినంత సపోర్ట్​ ఉందని 44 శాతం మంది మాత్రమే చెప్పారు. వర్కింగ్​మదర్స్​సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు తగిన విధానాలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. 

పొదుపులో మహిళలే బెస్ట్
గ్రామీణ మహిళా ఎంట్రప్రెనూర్లలో కనీసం 90 శాతం మంది తమ నెలవారీ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆదా చేస్తున్నట్టు తేలింది. వీరిలో 33 శాతం మంది తమ ఆదాయంలో 20శాతం–50శాతం మధ్య పొదుపు చేస్తున్నారని డీబీఎస్​ బ్యాంక్  సర్వేలో తేలింది. ముఖ్యంగా, 57శాతం మంది 20శాతం కంటే తక్కువ ఆదా చేస్తుండగా, ఐదుశాతం మంది 50శాతం కంటే ఎక్కువ ఆదా చేయగలుగుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌‌కు చెందిన 411 మంది మహిళా ఎంట్రప్రిన్యూర్లు, 402 మంది స్వయం సహాయక బృందాలు (ఎస్​హెచ్​జీ) సభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును తయారు చేశారు.

వీరిలో 56శాతం మంది బ్యాంక్ డిపాజిట్లను ఎంచుకోగా, 39శాతం మంది ఎస్​హెచ్​జీ పొదుపు కార్యక్రమాల్లో డబ్బును ఇన్వెస్ట్​చేశారు. 18శాతం మంది ఇన్వెస్ట్​ చేయకుండా డబ్బును ఇంట్లోనే దాస్తున్నారు. బంగారంలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. 11శాతం మంది మాత్రమే బంగారంలో ఇన్వెస్ట్​ చేశారు. దాదాపు 64శాతం మంది తమ వ్యాపార లాభాలను తమ సంస్థలలో తిరిగి పెట్టుబడి పెట్టామని చెప్పారు. 36 శాతం మంది లోన్ల ద్వారా వ్యాపారాలను ప్రారంభించారు.