
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నది యథార్థం. ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదని చెబుతోంది మన భారతీయ సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. అందుకే ప్రకృతిని స్త్రీ రూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈసారి మహిళలకు పెద్దపీట వేస్తున్నది.
తెలంగాణను గత పదేండ్లు పాలించిన ప్రభుత్వం కంటే కాంగ్రెస్ సర్కారు మహిళల కోసం పనిచేస్తున్నదని చెప్పాలి. ఆకాశంలో సగం నువ్వు..సగం నేను. విప్లవిస్తే విజయం. ఉద్యమిస్తే ఉప్పెన అనే శ్రీశ్రీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మహిళా శక్తిని అద్భుతంగా పసిగట్టి పనిచేస్తున్నది ప్రజా ప్రభుత్వం. గత 15 నెలల నుంచి మహిళల పట్ల ఈ ప్రభుత్వం చూపుతున్న చొరవ, ప్రోత్సాహం, తాజాగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలు నారీ శక్తికి ధైర్యం నూరిపోస్తున్నాయి.
గృహజ్యోతి విషయానికొస్తే 200 యూనిట్లు లోబడి విద్యుత్ వినియోగిస్తున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. ఇప్పటివరకు రూ.1775. 15 కోట్లు విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా ప్రభుత్వం చెల్లింది. ఇందులో మరో పథకం. ఇందిరమ్మ ఇళ్లు. ఆడబిడ్డల పేరుతో ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించింది. రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశపెట్టింది.
ఈ విషయంలో లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. అయితే అసంపూర్తిగా నిలిచిపోయిన 34,545 ఇళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం రూ. 305.03 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడంలో ప్రజా ప్రభుత్వం అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం స్వయం సహాయ బృందాలకు ఓ భరోసా ఇస్తున్నది.
సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఎంఓయూ
దేశవ్యాప్తంగా వెలుగులు నింపే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి మహిళల పేరుతో ఎంఓయూ చేసింది. దేశంలో బడా పెట్టుబడిదా రులైన అంబానీ, అదానీలే కాదు, రాష్ట్రంలోని మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతున్నది. మహిళా పొదుపు సంఘాలతో 600 బస్సులు కొనుగోలు చేయించిన చరిత్ర దేశంలో ఎక్కడాలేదు. అంతేకాదు మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ హైటెక్ సిటీలో విలువైన ప్రాంతాన్ని కేటాయించి డ్వాక్రా బజార్ ప్రారంభించారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడుల బాధ్యత అప్పగించడం, అన్ని కలెక్టరేట్లలో మహిళా శక్తి క్యాంటీన్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని అప్పగించడం వల్ల మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుంది. మహిళలు అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా, వివక్షత నుంచి వికాసం దిశగా ఎదగాలని ప్రభుత్వం చేయూతను అందిస్తున్నది.
సీఎం రేవంత్ రెడ్డి సంకల్ప బలం, ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు బలం అన్నీ కలబోస్తే తెలంగాణ ఇందిరా మహిళా శక్తి అవుతుంది. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 20 రకాల వ్యాపారాలను చేసుకునే అవకాశం కల్పించింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రూ.21,632 కోట్ల రుణాలతో రెండు లక్షల 25 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలను
కూడా మహిళలే ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నది.
గేమ్ చేంజర్ మహాలక్ష్మి
మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో సహా ఏ పథకం చూసినా మహిళల పేర్లే. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం తర్వాత అదేరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ గురించి ప్రకటన చేశారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటివరకు 7,227 బస్సుల్లో 149.63 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారు.
దీని ద్వారా రూ. 5,005.95 కోట్లు మహిళలకు ఆదా అయ్యింది. ప్రారంభదశలో సాధారణ బస్సుల్లో 69 శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ఆ తర్వాత 94 శాతానికి పెరిగింది. ఈ పథకం తెలంగాణ సర్కారుకు గేమ్ చేంజర్ మహాలక్ష్మి అని స్వయంగా గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లను సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.433. 20 కోట్లు చెల్లించింది.
– బండి పల్లవి, సమాచార పౌర సంబంధాల అధికారిణి,జనగామ జిల్లా–