- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.కోట్లలో నడుస్తున్న దందా
- అందినకాడికి వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్న సంస్థలు
- మహిళలే టార్గెట్‌గా లోన్ల పేరుతో వసూళ్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘మా ఫైనాన్స్ కంపెనీలో మెంబర్ అయితే చాలు కమీషన్ ఎక్కువ ఇస్తాం..తక్కువ పెట్టుబడి..ఎక్కువ లాభం’ అంటూ పలు ప్రైవేట్ చిట్టీ సంస్థలు పేద, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తమకు కావాల్సినంత వసూలు అయ్యాక బోర్డు తిప్పేస్తుండడంతో ప్రజలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.
మరో వైపు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ మహిళలను టార్గెట్‌గా చేసుకుంటున్న కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు చెల్లిస్తే రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకు లోన్ ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. ముందుగా వచ్చిన ఇద్దరు, ముగ్గురికి ఇప్పించి మిగతా వారి సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నాయి.
బోర్డు తిప్పేస్తున్న సంస్థలు
ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ సంస్థ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు మరి కొన్ని చోట్ల బ్రాంచీలు ఓపెన్ చేసి తమ సంస్థలో నడుస్తున్న చిట్టీల్లో మెంబర్‌గా చేరితే కమీషన్ ఎక్కువ వస్తుందంటూ నమ్మించింది. చిట్‌ఫండ్ కంపెనీ ప్రతినిధుల మాటలు విన్న పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు పలువురు ఉద్యోగులు సదరు సంస్థలో చేరారు. మూడేండ్ల పాటు ప్రజలను నమ్మించిన ఆ సంస్థ ఇటీవల బోర్డు తిప్పేసింది.
సుమారు రూ. 4 నుంచి రూ. 5 కోట్లు సభ్యులకు చెల్లించకుండా ఉడాయించడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఓ వ్యక్తి రూ. 10 లక్షల చిట్టీ వేసి ఎత్తుకునేందుకు అవసరమైన అన్ని ష్యూరిటీలు ఇచ్చాడు. కొన్ని డబ్బులు ఇచ్చిన నిర్వాహకులు రూ. 4.88 లక్షలు ఇచ్చేందుకు ఎనిమిది నెలలుగా తిప్పారు. దీంతో బాధితుడు గురువారం డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
మరో వైపు వరంగల్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఓ చిట్‌ఫండ్ సంస్థ కొత్తగూడెం పట్టణంలోని సూర్యాప్యాలెస్ ఏరియాలో బ్రాంచ్ ఓపెన్ చేసి ఏడెనిమిది నెలల కిందట రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన వంద మందికి పైగా సభ్యులు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు నష్టపోయారు.
లోన్లు ఇప్పిస్తామంటూ..
మహిళలకు లోన్లు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు అందినకాడికి దోచుకుంటున్నారు. బస్తీల్లో కలుపుగోలుగా తిరిగే మహిళలను గుర్తించి రూ.3 వేల నుంచి రూ. 5 వేలు చెల్లిస్తే రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇలా 10 నుంచి 15 మందిని గ్రూపులుగా చేసి డబ్బులువసూలు చేస్తున్నారు. తర్వాత ఒకరిద్దరికి లోన్లు ఇప్పించి మిగతా వారికి ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడం లేదు.. కాగానే మీకు వచ్చిన ఓటీపీని చెప్పిన వెంటనే మీ అకౌంట్ డబ్బులు పడుతాయి’ అంటూ తిప్పించుకుంటున్నారు.
కొత్తగూడెం పట్టణంలోని పలు బస్తీల్లో ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది. డబ్బులు తీసుకొని లోన్లు ఇవ్వకుండా తిప్పుతున్నారంటూ కొత్తగూడెం పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన, ఫైనాన్స్ సంస్థ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహిళ ముందు కొందరు శుక్రవారం రాత్రి గొడవకు దిగారు. సదరు మహిళ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇదే విధంగా నెహ్రూ బస్తీకి చెందిన ఓ వ్యక్తి సుమారు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. వారం రోజుల్లో లోన్ వస్తుందని చెప్పడంతో పట్టీలు కుదువపెట్టి రూ. 5 వేలు కట్టానని, ఇప్పుడు డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.