జూడా హత్యాచార ఘటన నిందితులను శిక్షించాలి

జూడా హత్యాచార ఘటన నిందితులను శిక్షించాలి
  • ఇందిరా పార్కు వద్ద మహిళ సంఘాల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, డ్రగ్స్ ను నియంత్రించాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. కోల్​కతాలో జూనియర్​డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.అనసూయ, పీఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ వి.సంధ్య, స్వరూప, శ్రీదేవి పాల్గొని మాట్లాడారు.

ఘటన జరిగి 90 రోజులు గడచినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసినప్పటికీ, ఎఫ్ఐఆర్​లో ప్రిన్సిపల్ పేరు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించేంత వరకు మహిళా సంఘాల పోరాటం ఆగదని హెచ్చరించారు. సీబీఐ విచారణ వెంటనే చేపట్టి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఆమనగంటి వెంకటేశ్, ప్రదీప్, మహేశ్, నాగరాజు, అశోక్ రెడ్డి, అనురాధ, అరుణతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.