ఆడవారిని సమానంగా ఆదరించే కల్చర్ మనది.మన కుటుంబ వ్యవస్థలో ఈ లక్షణం ఇమిడిపోయి ఉంటుంది. ఈ సంప్రదాయమే సోషల్ లైఫ్ లోనూ, పబ్లిక్ లైఫ్ లోనూ కూడా కనపడుతుంది. ఖిల్జీల కాలంలో రాణి పద్మిని, తొలి స్వతంత్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి, మన రుద్రమదేవి, ఇండిపెండెన్స్ ఉద్యమ కాలంలో అనేకమంది కనిపిస్తారు. మోడర్న్ ఇండియాలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకుని గ్రామ సర్పంచ్ ల వరకు మహిళలు అవకాశాలు దక్కించుకుంటున్నారు. చట్టసభల్లో మూడో వంతు మహిళలకు కేటాయించాలన్న రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ, ప్రస్తుత లోక్ సభకు 78 మంది ఆడవారు ఎన్నికయ్యారు. ఇక సోషల్ లైఫ్ లోనూ, క్రీడారంగంలోనూ, సైన్స్ సాంకేతిక రంగాల్లోనూ టాప్ పొజిషన్ కు వెళ్లిన మహిళల సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడవారికి మంచి అవకాశాలు దక్కాయి. తెలంగాణలో 20 మంది జడ్పీ చైర్ పర్సన్లు కాగా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం, హోం మంత్రి వంటివి మహిళల చేతిలో ఉన్నాయి. అటు సెంటర్లో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ దక్కించుకున్నారు.
చాలా దేశాల్లో ఇప్పటికీ రాజకీయంగా ఆడవారు వెనుకబడి ఉన్నారు. ఇండియాలో మాత్రం పరిస్థితి డిపరెంట్. కీలకమైన రాష్ట్రపతి, ప్రధాని పదవులను సైతం మహిళలు చేపట్టారు. ఇందిరా గాంధీ చాలా కాలం దేశ ప్రధానిగా పనిచేశారు. పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేశారు. ‘మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్’గా పేరు తెచ్చుకున్నారు. అంతగా దేశ రాజకీయాలను ఇందిర ప్రభావితం చేశారు. మహారాష్ట్ర వనిత ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతి అయ్యారు. ప్రతిభా పాటిల్ పుట్టింది మహారాష్ట్రలోని మారుమూల పల్లె ప్రాంతం. ముంబైలో లా చదివారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో తొలి మహిళా రాష్ట్రపతి అయ్యారు. వివాదాలకు తావివ్వకుండా బాధ్యతలు నిర్వహించారు.
ఇక, లోక్‌సభకు ఇప్పటివరకు ఇద్దరు మహిళలు స్పీకర్లుగా పనిచేశారు. 2009లో మీరా కుమార్ లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించారు. రాజకీయ దిగ్గజం బాబూ జగ్జీవన్ రామ్ కూతురైన మీరా కుమార్ 1985లో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉండగానే లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత లోక్ సభకు స్పీకర్‌గా పూర్తి కాలం పనిచేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్. ఆమె సీనియర్ రాజకీయవేత్త. మధ్య ప్రదేశ్ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన చరిత్ర ఆమె సొంతం. 16వ లోక్ సభకు స్పీకర్‌గా పనిచేసి అన్ని రాజకీయ పార్టీల ప్రశంసలు అందుకున్నారు.
వీరేకాదు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా మహిళలు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సుచేతా కృపలానీ మన దేశంలో తొలి మహిళా సీఎం. 1963లో ఉత్తరప్రదేశ్ కు సీఎంగా ఆమె పనిచేశారు. ఆమె బాటలో ఎంతో మంది మహిళలు నడిచారు. ముఖ్యమంత్రులుగా రాణించారు. తమిళనాడు సీఎంగా జయలలిత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్, ఉత్తరప్రదేశ్ సీఎంగా మాయావతి, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే, గుజరాత్ సీఎంగా ఆనంది బెన్ పటేల్, బీహార్ ముఖ్యమంత్రిగా రబ్రీ దేవి, జమ్మూ కాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ, గోవా సీఎంగా శశికళ కాకోద్కర్ పనిచేశారు. పశ్చిమ బెంగాల్ కు ప్రస్తుతం మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు.
గవర్నర్లుగా…
రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్‌గా పేర్కొనే గవర్నర్ పదవిలోనూ మహిళలు రాణించారు. దేశానికి స్వతంత్రం రాగానే ఉత్తరప్రదేశ్‌కు సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె కూతురు పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగారు. ఇంకా, విజయలక్ష్మీ పండిట్, శారదా ముఖర్జీ, కుముద్ బెన్ జోషి, జస్టిస్ ఫాతిమా బీవీ, మార్గరెట్ అల్వా వంటి అనేకమంది గవర్నర్లుగా పనిచేసి, రాజ్యాంగ విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మృదులా సిన్హా (గోవా), ద్రౌపది ముర్ము (జార్ఖండ్), కిరణ్ బేడీ (పుదుచ్చేరి), ఆనంది బెన్ పటేల్ (మధ్యప్రదేశ్), బేబీ రాణి మౌర్య (ఉత్తరాఖండ్), నజ్మా హెఫ్తుల్లా (మణిపూర్) గవర్నర్లుగా బాధ్యతలు వహిస్తున్నారు.
సైంటిస్టులుగానూ….
సైంటిస్టులుగానూ మహిళలు సత్తా చాటారు. కల్పనా చావ్లా తొలి మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అలాగే అమెరికాలోని ‘నాసా’ లో పనిచేసిన సునీతా విలియమ్స్ కూడా మన దేశ ఆడపడుచే. ‘ఇస్రో’లోనూ చాలా మంది మహిళలు సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. రాకెట్ లాంచింగ్, శాటిలైట్ లాంచింగ్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జ్యుడీషియరీలో కూడా మహిళలు ఎంటరయ్యారు. కేరళకు చెందిన ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి జడ్జి అయ్యారు. 1992 వరకు సుప్రీం కోర్టు జడ్జిగా ఆమె కొనసాగారు. తెలుగువారుకూడా జడ్జిలుగా బాద్యతలు నిర్వహించారు .ప్రకాశం జిల్లాకి చెందిన జస్టిస్ రజనీ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్గిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రిటైరయ్యారు. వైద్యరంగంలోనూ ఆడవారు రికార్డులు సృష్టిస్తున్నారు. ఏ ఆస్పత్రి కి వెళ్లినా మగ డాక్టర్లకంటే లేడీ డాక్టర్లే కనిపిస్తుంటారు. ఒకప్పుడు గైనకాలజీ వంటి స్పెషలైజేషన్‌కే మహిళలు పరిమితమై ఉండేవారు. ప్రస్తుతం యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆంకాలజీ వంటి భిన్న రంగాల్లో స్పెషలిస్టులుగా రాణిస్తున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్లుగా …..
ఆల్ ఇండియా సర్వీసుల్లోనూ మహిళల పాత్ర చిన్నదేమీ కాదు. 1951లోనే సివిల్ సర్వీసెస్‌కు అన్నా రాజమ్ మల్హోత్రా ఎంపికయ్యారు. మన దేశంలో తొలి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా రాజమే. ఐపీఎస్ అంటే కేవలం మగవారికే అనే అభిప్రాయం చాలా ఏళ్ల వరకు ఉండేది. కిరణ్ బేడీ ఎంట్రీతో ఈ అభిప్రాయం మార్చుకోవలసి వచ్చింది. ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీది సక్సెస్ ఫుల్ ఇన్నింగ్స్.ఇలా ఒకటనేమిటి…!.సమాజాన్ని ప్రభావితం చేసే అన్ని రంగాల్లోనూ మహిళలు ఎంట్రీ ఇచ్చారు… రాణించారు… ఇప్పటికీ రాణిస్తున్నారు.