వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి.. ముగ్గురు మహిళలు అరెస్టు

ఓ వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళలు దాడి చేశారు.ఈ  ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరా ప్రకారం.. కామారెడ్డికి చెందిన కవిత అనే మహిళ.. దోమకొండ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న కాశీనాథ్ అనే వ్యాపారి నుంచి గత కొద్ది సంవత్సరాల క్రితం ఆరు లక్షల రూపాయల అప్పు తీసుకుంది. అప్పులో కొంత భాగం చెల్లించిన కవిత.. మిగతా అప్పు కొరకు చెక్కులు రాసి ఇచ్చింది. 

అయితే, ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో  చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో తనను కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. తన స్నేహితులైన సరిత, సానియాలతో కలిసి కవిత వెళ్లి..  కాశీనాథ్ ఇంటిపై దాడికి పాల్పడింది. ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లి  కాశీనాథ్ పై పెప్పర్ స్ప్రే కొట్టి.. అతని  భార్య భువనేశ్వరిపై దాడికి దాడి చేశారు.  భువనేశ్వరి మెడలో నుంచి రెండు తులాల  బంగారు గొలుసు లాక్కున్నారు.

ముగ్గురు మహిళలు దాడి చేస్తుండడంతో భయంతో  భువనేశ్వరి బయటకు పరుగులు తీసి కేకలు వేసింది. దీంతో స్థానికులు పారిపోతున్న ముగ్గురు మహిళలను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెప్పర్ స్ర్పే తోపాటు కత్తులను స్వాధీనం చేసుకుని దోమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.