ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. 2024, జూన్ 25వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రాజమండ్రి సిటీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్.. తమ 12 వందల గజాల భూమిని కబ్జా చేశారని.. దీనిపై ఎవరూ స్పందించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యను పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని.. తన బాధను చెప్పుకోవటానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరకు వస్తే.. సెక్యూరిటీ అడ్డుకున్నారంటూ వాపోయింది ఈ మహిళ. అందుకే క్యాంప్ ఆఫీస్ ఎదుట బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తన భూమి కబ్జాకు గురైందని.. అధికారులకు కంప్లయింట్ చేసినా లాభం లేదని చెబుతోంది ఈ మహిళ. మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబును కలుద్దామని వెళ్లినా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని.. అందుకే తన భర్తతో కలిసి పవన్ కల్యాణ్ కు చెప్పుకోవటానికి వచ్చినట్లు వెల్లడించారామె.
తన బాధను అర్థం చేసుకుని.. వైసీపీ కార్పొరేటర్ కబ్జా చేసిన తన భూమిని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారామె. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..