దొంగ స్వామిని.. నడి బజారులో చితక్కొట్టిన మహిళలు

మహబూబాబాద్ జిల్లాలో ఓ దొంగ స్వామిజీకి బడిత పూజ చేశారు మహిళలు. నడిరోడ్డుపై బట్టలూడదీసి మరీ కొట్టారు. దొంగ స్వామిజీ చేసిన పనికి మహిళలు ఆగ్రహంతో ఊగిపోయి.. తలో చెయ్యి వేయడంతో లబోదిబోమంటూ కాపాడాలంటూ ప్రాధేయపడ్డాడు. 

అసలేం జరిగిందంటే..? 

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ..ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొర్రూరులోని ఓ స్వామిజీని (దొంగ స్వామిజీ) ఆశ్రయించింది. సదరు మహిళకు తాయత్తులు కట్టి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దాదాపు రెండు నెలలుగా సదరు బాధిత మహిళను వేధిస్తున్నాడు. న్యూడ్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరిస్తూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 

ఏం చేయాలో తెలియక బాధితురాలు.. మహిళా సంఘాలను ఆశ్రయించింది. అందరూ కలిసి తొర్రూరు డివిజన్ కేంద్రంలో రెక్కీ నిర్వహించి.. ఎట్టకేలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగ స్వామిజీని పట్టుకున్నారు. అప్పటికే కోపంతో ఉన్న మహిళలు నడిరోడ్డుపై చితకబాదారు. ఎంతమంది మహిళలను ఇలా మోసం చేస్తూ.. లోబర్చుకుంటావంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. 

విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని.. స్టేషన్ కు తరలించారు. బాధితురాలితో పాటు మహిళా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.