మధ్యప్రదేశ్ లో మహిళా మెకానిక్‌‌ గ్యారేజ్‌‌

మధ్యప్రదేశ్ లో మహిళా మెకానిక్‌‌ గ్యారేజ్‌‌

ఇప్పటినుంచి ఆ గిరిజన ప్రాంత ఆడబిడ్డలు వలసలు వెళ్లి తక్కువ కూలికి పని చేయాల్సిన అవసరంలేదు. అఘాయిత్యాలను భరించాల్సిన పనిలేదు. ఒకరి దగ్గర పనికి వెళ్తున్నామనే భావం అంతకన్నా ఉండనక్కరలేదు. ఎందుకంటే, ఆర్థిక స్వాతంత్రం కోసం మెకానిక్ పని నేర్చుకున్నారు. వాళ్ల సొంత కాళ్లపై నిలబడు తున్నారు ఖల్వ​ అనే ఊరికి చెందిన ఆడపిల్లలు. మధ్యప్రదేశ్‌‌, ఖాండ్వా జిల్లాలో ఖల్వ అనేది చిన్న గిరిజన పల్లె. అక్కడ కోర్క్‌‌, సహరియా, బైగా అనే తెగల వాళ్లు నివసిస్తుం టారు. వ్యవసాయ భూమి సరిగా లేకపోవడం, అటవీ ప్రాంతం కావడంతో జీవనోపాధికోసం సీజన్‌‌ని బట్టి కొన్ని ప్రాంతాలకి కుటుంబాలతో సహా వలస వెళ్తుంటారు. అయితే, వాళ్లు వెళ్లిన చోటల్లా పనికి తగ్గ కూలీ డబ్బు ఇచ్చేవాళ్లు కాదు కొందరు. అందరూ సమానంగా పని చేసినా, ఆడామగా అనే తేడా చూపిస్తూ తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్లు. కొన్ని చోట్ల పనికి వెళ్లిన ఆడపిల్లలపై అఘాయిత్యాలు కూడా జరిగేవి. అవన్నీ తట్టుకోలేక మెకానిక్‌‌ పని నేర్చుకుంటున్నారు ఆ గ్రామానికి చెందిన ఆడపిల్లలు. 

ఇద్దరితో మొదలై..

దళారుల శ్రమ దోపిడీని తట్టుకోలేక ఆరునెలల క్రితం గాయత్రి, సవాలి అనే ఇద్దరు, దగ్గర్లోని టౌన్‌‌లో మెకానిక్‌‌ పని నేర్చుకోవడం మొదలు పెట్టారు. వాళ్లను చూసి ‘ఆడవాళ్లు మెకానిక్‌‌ పని చేయడం ఏంటి? కుట్టు మెషిన్‌‌ లాంటి పనులు చేసుకోవచ్చు కదా’ అని అనేవాళ్లు. ఆ మాటలేవీ పట్టించుకోకుండా మెకానిక్‌‌ పని నేర్చుకొని సొంతంగా షెడ్‌‌ తెరిచారు ఈ ఇద్దరు. దాంతో రోజుకు 400 రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇప్పుడు. ‘రోజంతా కష్టపడి కూలి పని చేసినా, ఎప్పుడూ ఇంత సంపాదించలేదు. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాం. సేవింగ్స్‌‌ కూడా మొదలు పెట్టాం’ అని చెప్పారు వీళ్లు. 

గాయత్రి, సవాలిని చూసి చాలామంది అమ్మాయిలు మెకానిక్‌‌ పని నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. అది గమనించి ఖాండ్వాలోని ‘స్పందన్‌‌ సమాజ్ సేవా సమితి’ అనే సంస్థ మిగతా ఆడపిల్లలకు ఫ్రీగా శిక్షణ ఇస్తోంది. వాళ్లకు ట్రైనర్లుగా గాయత్రి, సవాలిని పెట్టారు. ట్రైనింగ్ తీసుకునేవాళ్లలో చాలామంది ఇంటర్, డిగ్రీ చదు వుతున్నవాళ్లే. కొందరు బ్యూటీ పార్లర్ కోర్స్‌‌తో పాటు, మెకానిక్ పని కూడా నేర్చుకుంటున్నారు. ఇంకొందరు చిన్న కిరాణా షాప్‌‌ నడిపిస్తూ ఈ పని నేర్చుకుంటున్నారు. రెండు పనులు నేర్చుకొని ఒకే దగ్గర షాప్ తెరుస్తామని చెప్తున్నారు. ‘‘ఇప్పుడు అమ్మాయిల వలసలు కొంత తగ్గాయి. కూలి పనులు మాను కుంటున్నారు. అయినా, అమ్మాయిలు సున్నితమైన పనులే చేయాలని ఎలా అంటారు? మేం ఏ పనైనా చేయగలం. సొంతంగా పెద్ద గ్యారేజ్ తెరవాలనే ఆలోచన ఉంది. దాంట్లోనే మిగతా ఆడ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తా” అంటోంది గాయత్రి.