మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

కీర్తిని, అనితా నవీన్, స్వాతి, రాజలక్ష్మి.... ఈ నలుగురిది బెంగళూరు. వీళ్లకు బైక్​ నడపడమంటే చాలా ఇష్టం. దాంతో, ఒక బైకర్స్ గ్రూప్​గా ఏర్పడ్డారు. బుల్లెట్ మీద రయ్​మంటూ దూసుకెళ్లడమే కాకుండా మహిళల భద్రత గురించి కూడా మాట్లాడతారు వీళ్లు. మహిళల మీద రోజూ ఏదో ఒక రూపంలో జరుగుతున్న దాడులు,  వేధింపుల మీద అవేర్​నెస్ కల్పించాలి అనుకున్నారు. అందుకోసం కర్నాటక రాష్ట్రంలో ఒక నెలంతా ఉమెన్ సేఫ్టీ  రైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 17 నుంచి వీళ్ల స్పెషల్ రైడ్ మొదలుకానుంది.

కర్నాటకలోని 30 జిల్లాలు... మొత్తం 3,500 కిలోమీటర్ల జర్నీ. ఈ ప్రయాణంలో దారిపొడవునా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో మాట్లాడతారు ఈ నలుగురు బైకర్స్. మనదేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మహిళల మీద దాడులు, గృహహింస , వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మహిళలు ‘మేము ఒంటరివాళ్లం. ఏం చేయలేం’ అనుకుంటారు.  కానీ, అలాంటప్పుడే  ధైర్యంగా ఉండాలి. వాళ్లలో ఆ ధైర్యాన్ని నింపేందుకు ఈ ఉమెన్ బైకర్స్​ రెడీగా ఉన్నారు. అంతేకాదు రోడ్డుమీద, ఆఫీసులో... ఎక్కడైనా వేధించే ఆకతాయిల నుంచి తప్పించుకునేందుకు, వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ఆడవాళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్​ తెలియాలి. ఉమెన్ సేఫ్టీ  రైడ్ ద్వారా సెల్ఫ్​ డిఫెన్స్ పాఠాలు కూడా చెప్తారు ఈ ఉమెన్ బైకర్స్. ఈ ట్రిప్​లో వీళ్లకు ఏ ఇబ్బంది రాకుండా చూడడంతో పాటు డబ్బు సాయం చేస్తున్నాయి బెంగళూరులోని రోటరీ ఇ–క్లబ్ సఖి, రోటరీ బెంగళూరు మాల్గుడి వంటి సంస్థలు. ఈ నలుగురు ‘ఉమెన్ ఆన్ వీల్స్ బైకర్స్ గ్రూప్’లో, బెంగళూరులో మహిళలు నడుపుతున్న ‘సఖి’ అనే ఎన్జీవోలో సభ్యులు. 

కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది

‘‘మేం బైక్ మీద వెళ్తుంటే... మగవాళ్లు ఆశ్చర్యంగా చూస్తారు. ఆడవాళ్లు మాత్రం మా వైపు గర్వంగా చూస్తారు. వాళ్ల కళ్లలో ‘మేం కూడా బైక్ నడపగలం’ అనే కాన్ఫిడెన్స్  కనిపిస్తుంది” అంటోంది అనిత. ఉమెన్​ సేఫ్టీ రైడ్ ఎంతోమంది మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుందని చెప్తోంది బైక్ ఇన్​స్ట్రక్టర్ స్వాతి. ‘‘బైక్ రైడింగ్ నాకు థ్రిల్​ ఫీలింగ్​ని ఇస్తుంది. నేను వీధుల్లో బండి నడుపుతుంటే కొందరు మహిళలు నా దగ్గరకు వచ్చి ‘మాకు బండి నడపడం నేర్పించండి’అని అడిగేవాళ్లు. నేను అప్పుడప్పుడు సోలోగా ట్రిప్స్​ వేస్తాను. దాంతో, ఒంటరిగా ఎక్కడి కైనా వెళ్లగలననే నమ్మకం వచ్చింది. బండి ఎక్కడైనా ఆగిపోయినా కూడా మెకానిక్ కోసం వెతక్కుండా సొంతంగా  రిపేర్​ చేయడం కూడా నేర్చుకున్నా’’ అని తన ఎక్స్​పీరియెన్స్​ను చెప్పింది బైకర్ స్వాతి.