శివ.. శివా.. ఏంటీ ఘోరం అంటోంది సోషల్ మీడియా.. హనుమంతుని కటౌట్ ఎదుట.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బికినీ దుస్తుల్లో.. మహిళా బాడీ బిల్డర్ల ప్రదర్శనా అంటున్నారు నెటిజన్లు. 2023, మార్చి 4, 5 తేదీల్లో.. రెండు రోజులు జరిగిన ఈ పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం.. రత్లామ్ ప్రాంతంలో జరిగిన ఈ పోటీల్లో ప్రముఖ మహిళా బాడీ బిల్డర్లు అందరూ పాల్గొనటం ఓ విషయం అయితే.. వీటిని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించటం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.
వ్యాయామం, కసరత్తులు అంటే హనుమాన్ విగ్రహం ఉండి తీరాల్సిందే.. బలానికి ప్రతీక అయిన హనుమంతిని బొమ్మ ఎదుట.. మహిళలు బికినీ దుస్తుల్లో బాడీ బిల్డర్ పోటీలు ఏర్పాటు చేయటం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విచుకుపడుతుంది. 13వ మిస్టర్ జూనియర్ పోటీ పేరుతో వీటిని నిర్వహించారని.. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని గంగా జలంతో శుద్ధి చేశామని చెబుతోంది ఆ పార్టీ. పోటీలు జరిగిన ప్రాంతంలో హనుమాన్ చాలీసా చదవటం విశేషం.
ఈ విషయాన్ని రాద్దాంతం చేయటంపై బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. క్రీడల్లో మహిళలు రాణించాలనే ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకి లేదని.. మహిళలు క్రీడల్లో.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం వాళ్లకు ఇష్టం లేదంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్ పాయ్ వ్యాఖ్యానించారు. మహిళలను నీచ బుద్ధితో చూసే సంస్కతి కాంగ్రెస్ లోనే ఉందని విమర్శించారు. మహిళలు రెజ్లింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్ లో రాణించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని.. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చటం లేదంటూ విరుచుకుపడ్డారు బీజేపీ నేత.
ఈ పోటీలపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి కామెంట్స్ చేసుకుంటున్నారు. చూసే కళ్లను బట్టి కొందరిలో అశ్లీలత కనిపిస్తే.. మరికొందరిలో ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది అంటున్నారు. మరికొందరు మాత్రం బీజేపీ పార్టీ ఇలా చేయటం ఏంటని అంటుంటే.. కాంగ్రెస్ చేస్తే ఖచ్చితంగా ఇంత కంటే ఎక్కువ రాద్దాంతం బీజేపీ చేసేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా హనుమంతుని చిత్ర పఠం ముందు.. బికినీల్లో మహిళా బాడీ బిల్డర్లు ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది.