
సీజన్లతో సంబంధం లేకుండా షాపింగ్ మాల్స్ సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాగే.. కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ కూడా మహిళా కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.49కే చీర అని ఆఫర్ ప్రకటించడంతో… పేద, మధ్యతరగతి మహిళలు పెద్దసంఖ్యలో షాపింగ్ మాల్ కు వచ్చారు. వచ్చిన వారిని క్యూలైన్ లో మాల్ లోకి పంపించారు షాపింగ్ మాల్ సిబ్బంది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకే ఈ ఆఫర్ అని ముందే ప్రకటించడంతో.. ఆ సమయంలో చీరలు దక్కించుకునేందుకు మహిళలు పొద్దటినుంచే క్యూలైన్ లో ఎదురుచూశారు. నడి ఎండలోనూ అలాగే నిలబడిపోయారు. కొందరు తలకు తువాలు, కర్చీఫ్, కొంగు కప్పుకుని తమ వంతుకోసం ఎదురుచూశారు. అగ్గువ చీరలు దక్కించుకోవడం కోసం కష్టాలను కూడా ఓర్చుకున్నారు. షాపింగ్ మాల్ సిబ్బంది ఆఫర్ తో పాటు… ఎండ, రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండని మహిళలు అభిప్రాయపడ్డారు.