సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు : కార్పొరేటర్ సుజాత

సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్  నోటీసులు : కార్పొరేటర్ సుజాత
  • వివరణ ఇవ్వాలని ఆదేశం
  • చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే​ను చెప్పు దెబ్బ కొడతా: కార్పొరేటర్ సుజాత

హైదరాబాద్: కార్పొరేటర్ సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన కామెంట్లపై మహిళా కమిషన్ సీరియస్  అయింది. కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అంతకుముందు సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సుజాతా నాయక్, బొంతు శ్రీదేవి ఫిర్యాదు చేశారు. అనంతరం సుజాత నాయక్  ఏడుస్తూ మీడియాతో మాట్లాడారు. 

కార్పొరేటర్ గా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తన డివిజన్ కు వచ్చిన టైమ్ లో తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనను వేధించడంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఆమె వెల్లడించారు. కమిషన్  ఆయనపై చర్యలు తీసుకోకపోతే సుధీర్ రెడ్డి ఇంటిని ముట్టడించి, ఆయనను చెప్పు దెబ్బ కొడతానని సుజాత నాయక్ హెచ్చరించారు.