బషీర్ బాగ్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు చేశారని తెలిపారు. అయితే, ఈ స్కీమ్ కోసం లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంలాల్ నాయక్ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు కమీషన్లు ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని వివరించారు.
ఎస్సీ హాస్టల్స్ కు విడుదల అయ్యే నిధులను కూడా స్వాహా చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్థానికంగా పెట్రోల్ పంపులు , ఫామ్ హౌస్ ను నడుపుతున్నారని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం జ్యోక్యం చేసుకొని ఏసీబీ విచారణ జరపాలని కోరారు. కమిషన్ లో పిర్యాదు చేసిన వారిలో బాధిత మహిళలు ఆర్.లక్ష్మీ, నవిత , మల్లీశ్వరి, హేమ, కవిత ఉన్నారు.