ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా టీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం టీఎన్జీవోస్ భవన్లో మహిళా ఉద్యోగులను సన్మానించారు. జిల్లా రెడ్డి విమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు గోనే మణిమాలరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహిళలకు ఆటలు, పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు.
అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, డైరెక్టర్ పిల్లి రవి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను సన్మానించారు. శ్రీరాంపూర్ ఏరియా లోని వివిధ గనులు, డిపార్ట్మెంట్లపై ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే8 డిస్పెన్సరీలో జరిగిన కార్యక్రమంలోలో జీఎం సంజీవ రెడ్డి పాల్గొని ఉత్తమ ఉద్యోగులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు.
మందమర్రి ఏరియా కాసీపేట గనిపై సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలువురు మహిళా ఉద్యోగులను గని మేనేజర్అల్లావుద్దీన్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్సన్మానించారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్తో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి వారిని సన్మానించారు. ఇచ్చోడలోని కేజీబీవీలో జరిగిన వేడుకల్లో బోథ్ కోర్టు జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ బి.హుస్సేన్ పాల్గొన్నారు. మహిళా చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. జన్నారం తదితర మండలాల్లోనూ వేడుకలు నిర్వహించి మహిళలను సన్మానించారు.