
- నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో ఘటన
బాల్కొండ, వెలుగు: శ్రీరామనవమిని పురస్కరించుకుని పూజలు చేసేందుకు వెళ్లిన మహిళలను ఆలయంలోకి వీడీసీ , పూజారి రానివ్వకపోవడంతో కేసు నమోదైంది. ఎస్ఐ సంతోష్ తెలిపిన ప్రకారం.. నిజామాబాద్జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం కుంకుమార్చనలో పాల్గొనేందుకు కొందరు మహిళలు ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు చేయొద్దని.. వెళ్లిపోవాలని పూజారి అడ్డుకుని వెనక్కి పంపారు. కాగా.. మహిళలు కొద్దిసేపు ఆలయంలోనే ఉండిపోయారు.
అయితే.. వాళ్లు తిరిగి వెళ్లిపోయేవరకు ఉత్సవాలు ప్రారంభించొద్దని ఆలయ పూజారిని వీడీసీ ఆదేశించింది. దీంతో బాధిత మహిళలు పోలీసులకు కంప్లయింట్ చేశారు. 10 మంది వీడీసీ సభ్యులు, ఆలయ పూజారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. గ్రామానికి చెందిన గౌడ కులస్తులపై గతంలో విధించిన బహిష్కరణ కారణంగానే ఆ సామాజిక వర్గ మహిళలను అడ్డుకున్నట్లు తెలిసింది.