ఏపూరి గ్రామంలో బెల్టు షాపులు బంద్​ చేయాలని మహిళల ధర్నా

ఏపూరి గ్రామంలో బెల్టు షాపులు బంద్​ చేయాలని మహిళల  ధర్నా

చిట్యాల వెలుగు :  మండలంలోని  ఏపూరి గ్రామంలో   బెల్టుషాపులను వెంటనే తొలగించి,  నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని  స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు.  గ్రామానికి చెందిన యువకుడు బెల్ట్ షాపులో మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై  వెళ్తూ దారిలో యాక్సిడెంట్​లో  మృతి  చెందాడని,  కాలనీలోని కిరాణ దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారని,  వాటిని అడ్డుకోవాలని డిమాండ్​ చేశారు.     యువకులు  తెల్లవారుజాము నుంచే బెల్టు షాపుల్లోకి వెళ్తున్నారని,   ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

  అధికారులు పట్టించుకుని బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్‌‌ చేశారు.  మద్యం అమ్మినవారికి రూ. లక్ష  జరిమానా, గ్రామంలో తాగుతూ దొరికిన వారికి రూ. 20 వేల  జరిమానా వేయాలని,  గ్రామంలో తాగిన వారిని పట్టిస్తే 10 వేల రూపాయలు  బహుమానం ఇస్తామని  గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్ణయించారు.