
- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో విషాదం
నల్లబెల్లి, వెలుగు : అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాపురం గ్రామానికి చెందిన గాదం మొగిలి గొర్లు, గేదెల వ్యాపారం చేసేవాడు. బిజినెస్ సరిగా నడవకపోవడంతో రూ. 4 లక్షల వరకు అప్పు చేశాడు.
భర్త చేసిన అప్పులు చెల్లించాలన్న ఉద్దేశంతో అతడి భార్య గాదం లక్ష్మి (52) రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేసింది. పంట సాగు కోసం రూ. 6 లక్షల వరకు అప్పు చేసింది. పంట చేతికందే టైమ్‌లో చీడపీడలు ఆశించడంతో దిగుబడి రాలేదు. దీంతో మొత్తం రూ. 10 లక్షల వరకు అప్పు కావడం, వ్యవసాయం కలిసిరాకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి సోమవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. మృతురాలి భర్త గాదం మొగిలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.