లండన్ లో సంతోషంగా కొనసాగుతున్నఅందమైన కాపురం..అడిగిందల్లా సమకూర్చే భర్త అయినా ఆమె మనసు పక్కచూపు చూసింది.ఓ ట్యాక్సీ డ్రైవర్ చెప్పిన మాటలకు ఆకర్షితురాలై అతని మాటలు నమ్మి ఉచ్చులో పడింది ఓ మహిళ. ఇంకేముంది దేశం దాటి కట్టుకున్న భర్త, కన్న పిల్లలను వదిలేసి లండన్ నుండి శంషాబాద్ విమానాశ్రయంలో వాలిపోయింది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న భర్త వెంటనే సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్,శంషాబాద్ డిసిపి కార్యాలయంతోపాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు ఎయిర్పోర్ట్ పోలీసులు. ఆమె సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గోవాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వివాహితను టాక్సీ డ్రైవర్ ను గోవాలో అదుపులోకి తీసుకొని.. కుటుంబ సభ్యులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. తిరిగి లండన్ కు పంపారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ( అక్టోబర్ 9, 2024 ) వెలుగుచూసింది ఈ ఘటన.హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతానికి చెందిన దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు. భార్యాభర్తలు ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.ఇదిలా ఉండగా, గత కొన్ని రోజుల క్రితం భర్త తల్లి చనిపోవడంతో.. లండన్ నుండి హైదరాబాద్ కి వచ్చాడు. భర్త హైదరాబాద్ చేరుకొని తల్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేసుకొనే పనిలో ఉన్నాడు.
Also Read :- నా భార్య లంచం డబ్బు కట్టలు చూడండీ
అప్పటికే క్యాబ్ డ్రైవర్ తో ఫోన్లో టచ్ లో ఉన్న వివాహిత డ్రైవర్ హైదరాబాద్ రావాలని కోరడంతో రెక్కలు కట్టుకొని విమానం ఎక్కింది. కన్న పిల్లలను పార్క్ లో లండన్ లోనే వొదిలేసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వివాహిత ఫోన్ నంబర్ ఆధారంగా గోవాలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఒక బృందాన్ని గోవాకు పంపించి అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి మహిళను హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి లండన్ కు పంపించారు.