మహిళా సాధికారతే ప్రభుత్వాల లక్ష్యం.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ​విజయ రహత్కార్

మహిళా సాధికారతే ప్రభుత్వాల లక్ష్యం.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ​విజయ రహత్కార్
  • మొదటి మహిళా జన్ సున్వాయికి 60 కేసుల దరఖాస్తులు 
  • 30 ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారం

పద్మారావునగర్, వెలుగు: బాధిత మహిళలకు మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని జాతీయ మహిళా కమిషన్ చైర్​పర్సన్ విజయ రహత్కార్ చెప్పారు. సోమవారం సిటీలోని టూరిజం ప్లాజా సమగం హాల్ లో ఏర్పాటు చేసిన మొదటి మహిళా జన్ సున్వాయి(బహిరంగ విచారణ)లో ఆమె పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 60 దరఖాస్తులు అందగా, 30 అక్కడికక్కడే పరిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని, మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే ప్రభుత్వాల లక్ష్యమని చెప్పారు. మహిళా జన్ సున్వాయికి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులకు సత్వర పరిష్కారం అందించేందుకు కమిషనే బాధితుల వద్దకు వస్తోందన్నారు. గృహహింస, సైబర్ నేరాలు,ఆన్​లైన్ హెరాస్మెంట్, చైల్డ్ కస్టడీ, లైంగిక వేధింపులు, అత్యాచారాలు మరికొన్ని ఇతర కేసులు కమిషన్ దృష్టికి వస్తున్నాయన్నారు. 

హైదరాబాద్ పరిధిలో 2022 నుంచి 2024 పెండింగ్ కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసినట్లు తెలిపారు. మిగిలిన కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. నెలకు నాలుగు సార్లు  కమిషన్ బాధిత మహిళల వద్దకు వెళ్లి సత్వర న్యాయం చేసి అండగా నిలుస్తుందన్నారు. పెండింగ్ కేసుల వివరాలను తనకు అందించాలని పోలీసులను ఆదేశించారు. 

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ శారద నేరెళ్ల, మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్​క్రాంతి వెస్లీ, ఏసీపీ(క్రైమ్స్) విశ్వ ప్రసాద్, అడిషనల్​కలెక్టర్ జి.ముకుందరెడ్డి, డీసీపీ లావణ్య, జిల్లా మహిళా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, వయోవృద్ధుల శాఖ అధికారి రాజేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, బాధిత మహిళలు పాల్గొన్నారు.