ఎద్దు కాదు.. నా బిడ్డ.. ఈ పెద్దమ్మ వేదన వర్ణనాతీతం

ఎద్దు కాదు.. నా బిడ్డ.. ఈ పెద్దమ్మ వేదన వర్ణనాతీతం

పల్లె జనం ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి అనటానికే సజీవ సాక్ష్యం ఇది.. నేటికీ పల్లె జనం పశువులపై చూపించే ఆప్యాయతకు ఈ చిత్రం అద్దం పడుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పశువులతో పల్లెజనానికి ఉండే ఆత్మీయత, అనురాగాలకు ఈ చిత్రమే నిదర్శనం.. పొలంలో కరెంట్ తీగలు తగిన చనిపోయిన తన ఎద్దుపై పడి.. ఈ పెద్దమ్మ రోధిస్తున్న తీరు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. కన్న బిడ్డలా సాకిన ఎద్దు.. అకాల మరణంతో ఇంట్లో మనిషిని కోల్పోయిన బాధ వర్ణనాతీతం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామం. విద్యుత్ షాక్ తో ఏడు మూగజీవాలు చనిపోయాయి. ఈ క్రమంలోనే తన ఇంటి ఎద్దును కోల్పోయిన ఓ పెద్దమ్మ ఆవేదన ఎలాంటిదో ఈ చిత్రం స్పష్టం చేస్తోంది. 

కన్నోళ్లను.. కట్టుకున్న వాళ్లను.. కడుపున పుట్టిన బిడ్డలను కసాయిగా చంపుతున్న రోజుల్లో.. మన గ్రామాల్లో పశువులపై మన పెద్దలకు ఇంకా మమకారం, ఆత్మీయత, అనురాగాలు సజీవంగానే ఉన్నాయనటానికి ఇదే నిదర్శనం. 

తన జీవనాధారంలో తోడూనీడగా ఉన్న ఎద్దును కోల్పోయిన పెద్దమ్మకు.. ప్రభుత్వం కూడా అండగా ఉండాల్సిన సందర్భం కాదంటారా.. అవుననంటారా..