సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట : చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్లో మహిళలకే పెద్దపీట వేస్తున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని 11, 12 వార్డుల్లో, మండలంలోని తొగర్రాయి, కదంబాపూర్ గ్రామాల్లో గురువారం ప్రజాపాలన సదస్సుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ బీఆర్ఎస్​లీడర్లు దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ఉచిత ప్రయాణంతో బంధుత్వం పెరుగుతుంది

ఎల్లారెడ్డిపేట/ ముస్తాబాద్‌‌‌‌/గంభీరావుపేట, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా బంధుత్వం పెరిగిందని ప్రభుత్వ విప్‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌‌‌‌, గంభీరావుపేట మండలాల్లో ప్రజాపాలన సెంటర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రయాణంతో ఆడపడుచులు తమ తల్లిదండ్రులు, ఇతర బంధువులను చూసేందుకు ఆర్టీసీ సేవలను 
వినియోగించుకుంటున్నారన్నారు. 

నియంతృత్వ పాలనను బొంద పెట్టారు

తిమ్మాపూర్, వెలుగు:  రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్​నియంతృత్వ పాలన కొనసాగిందని, ఆ పాలన పట్ల ప్రజలు విసిగెత్తి ఆ పార్టీని బొంద పెట్టారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం తిమ్మాపూర్​మండలం పోరండ్ల, నుస్తులాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దరఖాస్తుల స్వీకరణ తీరుపై అధికారులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.