ఏ షీల్డ్​ యాప్​తో అనీమియాకు చెక్​

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని మహిళలు అనీమియా(రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం)తో ఇబ్బందులు పడుతున్నారని, అనీమియా ముక్త్ గా కరీంనగర్​ను మార్చే సంకల్పంతో ఏ- షీల్డ్ యాప్ ను రూపొందించినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. కరీంనగర్ లో అమలవుతున్న అనీమియా ముక్త్, ఏ షీల్డ్ మొబైల్ యాప్ నిర్వహణ అమలు తీరుపై బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడంవల్ల మహిళలు, కిశోర బాలికలతోపాటు గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వైద్యులు, ఏఎస్ సీఐ బృందానికి వివరించారు. మహిళలకు ఎర్ర రక్తకణాలు తగ్గడంతో రక్తహీనత, రుతుస్రావం, గర్భిణులు పలు సమస్యల్ని  ఎదుర్కొంటున్నారని, వాటికి  పరిష్కారం అందించేందుకు కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఏ షీల్డ్ అనే యాప్ ను రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ సీఐ ప్రొఫెసర్, డైరెక్టర్ సుబోధ్​ కందముతన్ బృంద సభ్యులు, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అధికారులు పాల్గొన్నారు. 

తిమ్మాపూర్: కరీంనగర్ లో గర్భిణులకు హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని డీఎంహెచ్​ఓ జువేరియా తెలిపారు. బుధవారం తిమ్మాపూర్​మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ టీం యూనిసెఫ్ ఆధ్వర్యంలో 18 మంది గర్భిణులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12 నుంచి 45  ఏండ్ల ఆడవారు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించిన గర్భిణులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్య లక్ష్మి భోజనం అందించారు.