నల్గొండ అర్బన్, వెలుగు : తమకు ఇండ్లు లేవంటూ నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో ఉన్న అనేశ్వరమ్మ గుట్టపై పలువురు మహిళలు కర్రలు పాతారు. ఉదయం నుంచే గుట్టపైకి చేరుకొని కర్రలు పాతారు. 500 మంది మహిళలు గుట్ట చుట్టూ చేరి తమకు నచ్చిన ప్రాంతంలో ప్లాట్లను ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు పాతి చీరలు పరిచారు. విషయం తెలుసుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు.. గుట్టపైకి చేరుకున్నారు. రెవెన్యూ అధికారుల సహాయంతో మహిళలను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా మహిళలు అక్కడే కూర్చున్నారు.
దీంతో కొంతమంది మహిళలను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఇతరులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో మహిళలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జీపులో కొంతమంది మహిళలను స్టేషన్ కు తరలించి మహిళా సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించారు.
అనంతరం డీసీఎం వెహికల్ తెప్పించి మహిళా పోలీసు సిబ్బంది సహకారంతో ఇతర మహిళలను అరెస్టు చేసి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనేశ్వరమ్మ గుట్టపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో గుట్టపై ఉన్న కొంతమంది మహిళలు అక్కడి నుంచి తప్పించుకొని ఇళ్లకు చేరుకున్నారు.